సింగరేణి సొమ్ము సర్​‘ కారు'కు!

V6 Velugu Posted on Jul 19, 2021

  • రెవెన్యూ, పోలీస్​ ఆఫీసర్లకు రెంట్​ చెల్లింపు
  • ఒక్కో వెహికల్​కు   నెలకు రూ.30-40వేలు
  • కలెక్టర్​, అడిషనల్​ కలెక్టర్​, ఆర్డీవోలకే నెలకు  రూ.1.10 లక్షలు
  • కార్లు లేకున్నా రెంట్​ జేబులో వేసుకుంటున్న  పలువురు ఆఫీసర్లు
  • సింగరేణి వ్యాప్తంగా రూ.లక్షల్లో ఖర్చు 

మంచిర్యాల,వెలుగు: సింగరేణి సంస్థ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, ఆఫీసర్లకు బంగారు బాతుగా మారింది. కోట్లాది రూపాయల నిధులను వివిధ జీవోల పేరిట దారిమళ్లించి ఇష్టారీతిగా ఖర్చుపెడుతున్నారు. ఇది చాలదన్నట్టు రెవెన్యూ, పోలీస్​ డిపార్ట్​మెంట్లకు చెందిన పలువురు ఆఫీసర్లకు రెంట్​ కార్ల పేరిట రూ.లక్షలు చెల్లిస్తున్నారు. అధికారికంగా, అనధికారికంగా పెద్ద మొత్తంలో  సింగరేణి సొమ్మును దారబోస్తున్నారు. 
రెవెన్యూ, పోలీస్​ ఆఫీసర్లకు రెంట్​ వెహికల్స్​...  
సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే రెవెన్యూ, పోలీస్​ డిపార్ట్​మెంట్లకు చెందిన పలువురు ఆఫీసర్లకు సింగరేణి సంస్థ నుంచి రెంట్​ వెహికల్స్​ ఏర్పాటు చేశారు. కొంతమంది ఆఫీసర్లు ప్రైవేటుగా ఏర్పాటు చేసుకున్న వాహనాలకు నెలనెలా రూ.లక్షల్లో రెంట్ చెల్లిస్తున్నారు. వీరందరికి సర్కారు కార్లున్నా, మేంటనెన్స్​ ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తున్నా... సింగరేణి సొమ్ముతో రెంట్​ వెహికల్స్​ పెట్టుకొని సొంతానికి వాడుకుంటున్నారు. మరికొంత మంది వెహికల్స్​ లేకున్నా... సింగరేణి చెల్లించే రెంట్​ డబ్బులను ఏంచక్కా జేబులో వేసుకుంటున్నారు. 
కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలకు... 
మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్​ ఏరియా పరిధిలో జిల్లా కలెక్టర్​, అడిషనల్ కలెక్టర్​, ఆర్డీవోలకు కారు రెంట్​ చెల్లిస్తున్నారు. కలెక్టర్​కు​ టీఎస్​19 9244 టొయోటా ఇన్నోవా క్రిస్టా, అడిషనల్​ కలెక్టర్​కు​ ఏపీ16సీపీ 7272 టొయోటా ఇన్నోవాలకు నెలకు రూ.40వేల చొప్పున, ఆర్డీవోకు ఏపీ 11ఏఎస్​ 7625 ఇన్నోవాకు నెలకు రూ.30వేలు రెంట్​ ఇస్తున్నారు. కలెక్టర్​కు ప్రభుత్వమే ఇన్నోవా క్రిస్టా కారు (టీఎస్​19సీ 1009)ను ఏర్పాటు చేసింది. అడిషనల్​ కలెక్టర్​కు గతంలో ఇన్నోవా ఉండగా, ప్రభుత్వం ఇటీవలే కియా కార్నివాల్​ కారును ఇచ్చింది. ఆర్డీవోకు సైతం ప్రభుత్వ వాహనం ఉంది. వీరు రోజూ గవర్నమెంట్​ వెహికల్స్​లోనే తిరుగుతున్నారు. సింగరేణి రెంట్​తో కలెక్టర్​కు ఏర్పాటు చేసిన టీఎస్​19 9244 ఇన్నోవా క్రిస్టా హైదరాబాద్​, మంచిర్యాల మధ్య తిరుగుతోంది. ఈ వెహికల్​పై 2019 ఆగస్టు 14 నుంచి 2021 జూన్​ 29 వరకు సిద్దిపేట, సైబరాబాద్​, కరీంనగర్​, హైదరాబాద్​, రామగుండం, నిజామాబాద్​ యూనిట్ల పరిధిలో 17 ఈ-చాలన్లు పడ్డాయి. ఓవర్​ స్పీడ్​ డేంజరస్​ రైడింగ్​ ఫైన్లు రూ.16,695 పెండింగ్​ ఉన్నాయి. మిగతా రెండు కార్లు ఎక్కడ తిరుగుతున్నాయో తెలియదు.

Tagged money, singareni, TS Govt,

Latest Videos

Subscribe Now

More News