
- 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తే సంస్థ లక్ష్యం
- ఉత్పత్తి వ్యయం తగ్గించుకోకపోతే మనుగడ కష్టం
- సింగరేణి సీఎండీ ఎన్. బలరాం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో త్వరలో కొత్తగా మూడు మైన్స్ ప్రారంభించనున్నట్టు సీఎండీ ఎన్. బలరాం పేర్కొన్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుక్రవారం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లెందు, కొత్తగూడెం, గోలేటి ప్రాంతాల్లో కొత్త గనులను ప్రారంభించనున్నామన్నారు.
భవిష్యత్ లో వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా సింగరేణి ముందుకు సాగుతుందన్నారు. థర్మల్విద్యుత్ను 3వేల మెగావాట్లు, సోలార్విద్యుత్ను 5 వేల మెగావాట్లకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గ్రీన్ హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్తయారీ ప్లాంట్ను కూడా ప్రారంభించేందుకు ప్లాన్చేస్తున్నామన్నారు. ఖనిజాల రంగంలోకి సంస్థ ప్రవేశిస్తుందన్నారు. ప్రస్తుత పోటీ మార్కెట్ సింగరేణి నిలబడాలంటే కస్టమర్లకు నాణ్యమైన బొగ్గును అందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోకపోతే సంస్థ మనుగడకే కష్టమవుతుందన్నారు. కోల్ఇండియా దశాబ్ద కాలంలో 20 శాతం బొగ్గు ధరలు పెంచితే సింగరేణి 170శాతం పెంచిందన్నారు. మెషీన్ల పని గంటలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థలో 25వేల మంది యువ కార్మికులున్నారన్నారు. వారు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు.
అనంతరం సింగరేణి వ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్తమ ఉద్యోగులను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కంపెనీ డైరెక్టర్లు గౌతమ్పొట్రు, డి. సత్యనారాయణ, ఎల్వీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు కె. రాజ్ కుమార్, త్యాగరాజన్ లతో కలిసి సీఎండీ సన్మానించారు. ఈ ప్రోగ్రాంలో జీఎం వెల్ఫేర్జీవీ. కిరణ్ కుమార్, సీఎంఓ ఏఐ ప్రెసిడెంట్ టి. లక్ష్మీపతి పాల్గొన్నారు.