వచ్చే నెలలో సింగరేణిలో కొత్త వేతనం..అగ్రిమెంట్​పై కోల్​ మినిస్టర్​ సంతకం

వచ్చే నెలలో సింగరేణిలో కొత్త వేతనం..అగ్రిమెంట్​పై కోల్​ మినిస్టర్​ సంతకం

కోల్​బెల్ట్​,వెలుగు: సింగరేణి కార్మికులకు 11వ వేజ్​బోర్డు ఈనెల నుంచే అమల్లోకి రానుంది. జూలైలో కార్మికులు కొత్త వేతనాలు అందుకోనున్నారు. 11వ వేజ్​బోర్డు అగ్రిమెంట్​పై కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి ప్రహ్లద్​జోషి  సోమవారం సంతకం చేశారు.  ఈనెల 21న కోలిండియా నుంచి సర్క్యులర్​ వచ్చే అవకాశం ఉంది. సర్క్యులర్ రాగానే సింగరేణిలోని 42 వేల మంది కార్మికులకు 11వ వేజ్​బోర్డు ప్రకారం  వేతనాలు ఇస్తారు. గతనెల జరిగిన 11వ వేజ్​బోర్డుమీటింగ్​లో 19శాతం మినిమమ్​ గ్యారంటీ బెనిఫిట్​, 25శాతం ఇతర అలవెన్సులు కలిపి కొత్త వేతనాలను ఖరారు చేశారు. 

 ఒకటో కేటగిరీ కార్మికుడు 26 రోజుల పాటు   పనిచేస్తే ఇప్పుడు  రూ.26,293 వస్తుండగా  కొత్త వేతనం ప్రకారం  రూ.39,069 అందనున్నాయి. వేతనం దాదాపు  రూ.12,776 పెరుగుతుంది. 10వ వేజ్​బోర్డులో ఏడీఏ రోజుకు రూ.18.15 ఉండగా, ప్రస్తుతం రూ.26.97కు పెంచారు. 11వ వేజ్​బోర్డ్ అమలు వల్ల సింగరేణిపై నెలకు రూ.70కోట్ల వరకు భారం పడనుంది. జులై 3న సింగరేణి కార్మికులు కొత్త వేతనం అందుకుంటారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ మెంబర్​ వాసిరెడ్డి సీతారామయ్య, బీఎంఎస్​ స్టేట్​ ప్రెసిడెంట్​ యాదగిరి సత్తయ్య  తెలిపారు.