మరో 800 మెగావాట్ల సోలార్ ఫ్లోటింగ్ ప్లాంట్లు

మరో 800 మెగావాట్ల సోలార్ ఫ్లోటింగ్ ప్లాంట్లు

 

  • మానేరు డ్యాం, మల్లన్న సాగర్​లో ఏర్పాటుకు సింగరేణి సన్నాహాలు
  • సింగరేణి అధికారులతో సీఎండీ బలరామ్ సమీక్ష

 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జలాశయాలపై మరో 800 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 234 మెగావాట్ల సోలార్ ప్లాంట్​ను ఏర్పాటు చేసిన సంస్థ.. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని సీఎండీ బలరాం పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాపార విస్తరణలో భాగంగా కొత్తగా చేపట్టనున్న సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులపై చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం మేరకు మానేరు డ్యాంలో 300 మెగావాట్ల ప్లాంట్, మల్లన్నసాగర్ జలాశయంలో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్​ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎండీ ఆదేశించారు. లోయర్ మానేరుకు  సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉందని, ప్రభుత్వ అనుమతితో నిర్మాణం చేపట్టడానికి కంపెనీ రెడీగా ఉందన్నారు. మల్లన్నసాగర్ లో ప్లాంట్ ఏర్పాటుకు డీపీఆర్  సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

రాజస్థాన్, జైపూర్​ ప్లాంట్లపైనా సమీక్ష

రాజస్థాన్ లో  సింగరేణి నిర్మించనున్న 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కార్యాచరణపైనా సమీక్షించారు. దానిపై మరింత లోతుగా అధ్యయనం జరపాలని, తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి జరిగేలా ప్రణాళిక రూపొందించాలని సీఎండీ సూచించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ లో అదనంగా నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల థర్మల్  ప్లాంట్ టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తిచేసి.. నిర్మాణం ప్రారంభించాలన్నారు. కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత లాల్ మీనా.. ఇదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మించేందుకు నివేదిక సమర్పించాలని చైర్మన్ ను ఆదేశించారు. రాష్ట్రంలో పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించి నివేదిక రూపొందించాలని ఆయన సూచించారు.