లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వనోళ్లు..10,490 మంది..పింఛన్ కు దూరమైన సింగరేణి రిటైర్డు ఉద్యోగులు

లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వనోళ్లు..10,490 మంది..పింఛన్ కు దూరమైన సింగరేణి రిటైర్డు ఉద్యోగులు
  • వీరంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉండటమే కారణం
  • ఫలితమివ్వని సీఎంపీఎఫ్​క్యాంపులు
  • మొబైల్​క్యాంపులు పెట్టాలని రిటైర్డ్ ఉద్యోగుల డిమాండ్

కోల్​బెల్ట్, వెలుగు :  సింగరేణివ్యాప్తంగా వేలాది మంది రిటైర్డు ఉద్యోగులు, కుటుంబసభ్యులకు పింఛన్ నిలిచిపోయింది.  ఇందుకు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించకపోవడమే కారణమని తేలింది. రామగుండం సీఎంపీఎఫ్​కమిషనర్​ఆఫీస్​పరిధిలో ఎంతమందికి పింఛన్లు చెల్లిస్తున్నారనే వివరాలపై ఇటీవల సింగరేణి రిటైర్డు ఎంప్లాయీస్​వెల్ఫేర్​అసోసియేషన్​స్టేట్​డిప్యూటీ జనరల్​సెక్రటరీ ఆళవందార్​వేణుమాధవ్​ఆర్టీఐ కింద వివరాలు కోరారు. 

కాగా.. ఈ ఏడాదిలో10,490 మంది రిటైర్డు ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించలేదని సీఎంపీఎఫ్​ఆఫీసర్లు వెల్లడించారు.  సాధారణంగా పెన్షన్​ పొందేందుకు రిటైర్డు కార్మికులు, కుటుంబీకులు ఏటా నవంబర్​లోపు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలి.  వీటిని ఆఫ్​లైన్​లో లేదా ఆన్​లైన్​లోనూ అందించాల్సి ఉంటుంది. 

 అయినా వేలాది మంది లైఫ్ సర్టిఫికెట్లు సకాలంలో ఇవ్వకపోవడంతో పింఛన్​నిలిచిపోయింది. ఇందుకు మారుమూల పల్లెల్లో ఇంటర్నెట్ సెంటర్లలో అవగాహన లేక ఆర్గనైజేషన్, పేయింగ్ అథారిటీ, బ్యాంకు ఖాతా, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ సరిగా నింపకపోవడంతో పాటు తప్పులు దొర్లడంతో మరికొందరు పింఛన్​కు దూరమయ్యారు.

క్యాంపులతో అంతంతే.. 

సింగరేణిలోని గోలేటీ నుంచి భూపాలపల్లి వరకు ఉన్న బొగ్గు గనులు రామగుండం సీఎంపీఎఫ్​కమిషనర్​ఆఫీస్​పరిధిలోకి వస్తాయి.  ఏటా నవంబర్​లో లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం కారణంగా భారీగా రిటైర్డు ఉద్యోగులు, కుటుంబీకులు పింఛన్ పొందకపోవడాన్ని గుర్తించిన రామగుండం సీఎంపీఎఫ్​  ఆఫీసర్లు నేరుగా సింగరేణివ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయించారు.

 సీఎంపీఎఫ్​సంస్థ భవిష్యత్ లో పింఛనర్లు మరణించినా, వారి భాగస్వాములకు సకాలం లో పింఛను అందించేందుకు డిజిటల్​లైఫ్​సర్టిఫికెట్ల(డీఎల్​సీ)4.0 విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై అవగాహన కల్పించేం దుకు గత నవంబర్​3 నుంచి 28 తేదీ వరకు ఆఫీసర్లు వివిధ ఏరియాల్లో లైఫ్​సర్టిఫికెట్లు ఆన్​లైన్​చేసే ప్రక్రియను చేపట్టారు. దీనికి పెన్షన్​దారుల నుంచి పెద్దగా స్పందనరాలేదు. 

దూరప్రాంతాల్లో ఉండడంతోనే.

సింగరేణిలో గతంలో పనిచేసిన వారంతా దాదాపు నిరక్షరాస్యులు కావడం, రిటైర్​అయిన తర్వాత చాలామంది అనారోగ్యం బారినపడడం, కుటుంబ సభ్యులు సైతం గుర్తుంచుకోలేకపోవడం వంటి సమస్యలతో ఏటా నవంబర్​లో పింఛన్​ కోసం లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్నారు. రిటైర్డు అయిన తర్వాత ఉద్యోగులు దూరప్రాంతాల్లోని సొంతూరుల్లోకి వెళ్లడం, వృద్ధాప్యం వల్ల సర్టిఫికెట్ ఇవ్వాలనే సమాచారం తెలుసుకోలేకపోతున్నారు. 

దీనికి తోడు సింగరేణిలోని మైన్లు/డిపార్ట్​మెంట్ల నుంచి కూడా సరైన సమాచారం ఇవ్వడం లేదని పలువురు పెన్షనర్లు పేర్కొంటున్నారు. ప్రతి ఏటా నవంబర్​లో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించేందుకు సీఎంపీఎఫ్​ ఆఫీసర్లు మొబైల్​ క్యాంపులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. జమ్మికుంట, పరకాల, కరీంనగర్ ​తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేచాలని సూచిస్తున్నారు. దీంతో పాటు సింగరేణి మెడికల్ ఫెసిలిటీ​కార్డు రెన్యూవల్​ సౌకర్యం కల్పిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

జనవరి వరకు చాన్స్​ఇవ్వాలి

సింగరేణి రిటైర్డు ఉద్యోగులు, కుటుంబీకులకు లైఫ్ సర్టిఫికెట్లు సమర్పణకు వచ్చే జనవరి వరకు చాన్స్ ఇవ్వాలి. చాలామంది గ్రామాల్లో ఉండడం, మరిచిపోవడం వంటి కారణాలతో సకాలంలో సర్టిఫికెట్లు అందించలేకపోయారు. దూరప్రాంతాల్లోని  వారికి సీఎంపీఎఫ్​ఆఫీసర్లు మొబైల్​క్యాంపు సేవలను అందించాలి. అక్కడే సీపీఆర్​ఎంఎస్​ మెడికల్ కార్డ్​రెన్యూవల్​ చేసుకునే సౌకర్యం కల్పించాలి. ఇందుకు సీఎంపీఎంఫ్​, సింగరేణి చొరవ చూపాలి. - వేణుమాధవ్, సింగరేణి రిటైర్డు ఎంప్లాయీస్ వెల్ఫేర్​ అసోసియేషన్​ డిప్యూటీ జనరల్​ సెక్రటరీ

మూడు దశాబ్దాలుగా సవరించలేదు 

బొగ్గు గని కార్మికుల పింఛను సవరించకపోవడంతో పాత విధానంలోనే లబ్ధి పొందుతున్నారు.  మార్కెట్​సూచీ, ధరల ప్రకారం ప్రతి మూడేండ్లకు ఒకసారి రిటైర్డు ఉద్యోగులకు చెల్లిస్తున్న పెన్షన్​ సవరించాలి. కానీ, 1995 లో ప్రవేశపెట్టిన పింఛనును మూడు దశాబ్ధాలుగా చెల్లిస్తున్నారు. దీంతో రూ.1000 లోపు పింఛను పొందుతున్న రిటైర్డు ఉద్యోగులు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్​ అంత కూడా రిటైర్డు ఉద్యోగులకు అందడంలేదు.

పెన్షన్​పెంచాలని ఏండ్లుగా ఉద్యమిస్తున్నా ఫలితం లేదు. దీంతో అరకొర పెన్షన్​ కోసం వందల్లో ఖర్చు చేసి లైఫ్​సర్టిఫికెట్ల దరఖాస్తుకు రిటైర్డు ఉద్యోగులు ఆసక్తి చూపకపోవడం ఒక కారణంగా ఉంది.  సింగరేణిలో ప్రస్తుతం 82,387 మంది రిటైర్డు ఉద్యోగులున్నారు. వీరికి ప్రతి నెల రూ.80కోట్ల పెన్షన్​ చెల్లిస్తున్నారు. తక్కువ పెన్షన్​పొందుతున్నవారు 8,349 మంది ఉన్నారు. వీరు 30 – 35ఏండ్ల పాటు భూగర్భ గనుల్లో పనిచేసిన రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్​గా దక్కేది రూ.1000లోపే కావడం గమనార్హం.