- మేం బయటపెట్టినప్పటి నుంచి వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయ్: కేటీఆర్
- సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
- గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని హరీశ్ రావు ఆధారాలతో బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో వణుకు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసే సరికి పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. ఆధారాలతో సహా ఈ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సింగరేణిని రేవంత్ కబళిస్తున్నారని, ఈ అంశంలో ఇన్వాల్వ్ కావాలని కోరామన్నారు. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో ఎంక్వైరీ చేయించేలా కిషన్‌రెడ్డికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.
మంగళవారం సాయంత్రం కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు.. సింగరేణి వ్యవహారంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో కేటీఆర్మాట్లాడారు. సింగరేణి అవినీతి వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు విచారణ పేరిట ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నారని విమర్శించారు. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదని, ఇప్పుడు దానిని కోల్ మాఫియాకి నాయకుడిగా ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి ఏర్పడిందన్నారు.
సైట్ విజిట్ ఎందుకు పెట్టారంటే నో ఆన్సర్
దేశంలో ఏ బొగ్గు గనిలోనూ లేనివిధంగా సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధనను ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదని కేటీఆర్ విమర్శించారు. 2018 నుంచి 2024 మధ్యన కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను సిఫార్సు చేసి ఉన్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని చెప్పారు. ‘‘టెండర్ చేస్తారు.. మళ్లీ వెంటనే ఆ టెండర్‌ను రద్దు చేస్తారు. టెండర్లో ఈ నిబంధన లేకుండా ఆ రోజు మీరు టెండర్ పిలిస్తే మైనస్ 7 శాతం అంటే ఎస్టిమేట్ చేసిన దానికంటే 100 రూపాయలకు ఎస్టిమేట్ చేస్తే 93 రూపాయలకే పని చేస్తామని కాంట్రాక్ట్ సంస్థలు ముందుకు వచ్చాయి.
కానీ, దాన్ని మీరు రద్దు చేశారు. ఈ సైట్ విజిట్ నిబంధన పెట్టారు. దానివల్ల ఏమైంది? తిరిగి మళ్లీ టెండర్‌ను పిలిస్తే ప్లస్ 12 శాతం.. అంటే 100 రూపాయలకయ్యే పని 112 రూపాయలకి కావాలని చెప్పి మరి సంస్థలు వచ్చిన మాట వాస్తవం కాదా?’’ అని ప్రశ్నించారు. ఈ నిబంధన పెట్టిన మే 25 నుంచి ఇప్పటివరకు ఎన్ని సంస్థలు సైట్‌ను సందర్శించారో.. ఎన్ని ఈ మెయిల్స్ వచ్చాయో.. ఎంతమందికి సర్టిఫికెట్ ఇచ్చారో శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
