నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన సింగరేణి సెక్యూరిటీ ఉద్యోగి

నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన సింగరేణి సెక్యూరిటీ ఉద్యోగి

మందమర్రి, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి సెక్యూరిటీ ఉద్యోగి ఒకరు జాబ్​ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. అర కోటి వరకు వసూలు చేశాడు. చివరకు మోసపోయామని గుర్తించిన బాధితులు శుక్రవారం సింగరేణి ఆఫీస్​ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.   బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ కు చెందిన కోల మహేశ్వర్​రావు మందమర్రి ఏరియా సింగరేణి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సింగరేణి డైరెక్టర్లు, పలువురు జీఎంలతో పరిచయం ఉందని, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించాడు. ప్రైవేటు సెక్యూరిటీ గార్డు జాబ్​ అంటూ ఒక్కొక్కరి నుంచి రూ.1.6 లక్షల చొప్పున మంచిర్యాల జిల్లా జైపూర్, మందమర్రి, నస్పూర్, కాసీపేట మండలాలకు చెందిన పది మంది నుంచి రూ.16.9 లక్షలు వరకు వసూలు చేశాడు. డెల్టా సెక్యూరిటీ ఫోర్స్​ అండ్​ సెక్యూరిటీ కన్సల్టెంట్​ పేరుతో ఫేక్​ఐడీ కార్డులు ఇచ్చి జూన్​ నుంచి  వీరికి మంచిర్యాల బైపాస్​ రోడ్డులో పెట్రోలింగ్​ డ్యూటీ అప్పగించాడు. సెక్యూరిటీ యూనిఫాం ఇచ్చి జనసంచారం లేనిచోట డ్యూటీ చేయాలని చెప్పాడు. వారికి అనుమానం రాకుండా రెండు, మూడు రోజులకోసారి వెళ్లి తనిఖీల పేరిట పుస్తకంలో సంతకం పెట్టి వచ్చేవాడు. స్క్రాప్​లారీలను గమనించాలంటూ పురమాయించాడు. ఒకరిద్దరికి మందమర్రి ఏరియాలోని మైన్లపై కూడా డ్యూటీ వేశాడు.  జూన్, జూలైలో డ్యూటీ చేసినందుకు ఒక్కొక్కరికి  రూ.9 వేల నుంచి రూ.13 వేల వరకు జీతాలు ఇచ్చాడు. పర్మినెంట్​ సింగరేణి సెక్యూరిటీ గార్డుల పేరుతో కొందరు యువకులకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్​పరీక్షలు చేయించాడు. ఎక్కువమొత్తం చెల్లించినవారికి పరీక్షలు లేకుండా సర్టిఫికెట్లు ఇప్పించాడు.  జూలై నెలలో సింగరేణి డైరెక్టర్(పర్సనల్) పేరుతో మందమర్రి ఏరియా సింగరేణి జీఎంకు జారీ చేసినట్లుగా పర్మినెంటు సింగరేణి సెక్యూరిటీ గార్డులుగా ఫేక్​ జాయినింగ్​లెటర్లు ఇచ్చాడు. పర్మినెంటు చేయడానికి మొత్తంగా ఒక్కొక్కరి నుంచి రూ.5.5 లక్షల వరకు దండుకున్నాడు. బాధితులు గణేశ్, శివశంకర్​వరప్రసాద్​అక్కలైన వందన, తిరుమలకు సింగరేణి జూనియర్​అసిస్టెంట్​పోస్టులు ఇప్పిస్తానని రూ.6 లక్షల చొప్పున వసూలు చేశాడు. పర్మినెంట్​అయినప్పటికీ మస్టర్లు వేసుకోవడానికి ఆఫీస్​కు వెళ్లకపోవడం, ఆఫీసర్లను పరిచయం చేయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు శుక్రవారం మందమర్రి సింగరేణి ఎస్​అండ్​పీసీ ఆఫీస్​కు వెళ్లి ఆరా తీశారు. ఫేక్ ​ఉద్యోగాలు కల్పించి కోల మహేశ్వర్​ తమను మోసం చేశాడని గుర్తించి ఆందోళనకు దిగారు. మహేశ్వర్​రావుపై చర్య తీసుకోవాలని సింగరేణి సీనియర్​సె క్యూరిటీ ఆఫీసర్​ రవికి ఫిర్యాదు చేశారు. 

జైలు నుంచి విడుదలైనా మారలే

క్యాతన్​పల్లి, నస్పూర్​లో రియల్​ఎస్టేట్​బిజినెస్​పేరుతో పలువురు వద్ద డబ్బులు వసూలు చేసి స్థలాలు రిజిస్ట్రేషన్​ చేయకపోవడంతో కోల మహేశ్వర్​రావుపై కేసులు నమోదయ్యాయి. 2019 ఫిబ్రవరిలో ధర్మపురి మండలం ఆరెపల్లికి చెందిన జిల్లపల్లి సాగర్, సింగరేణి ఆఫీసర్​ వద్ద డ్రైవర్​గా పనిచేసే యువకుడు, సింగరేణి కార్మికుడి కొడుకు, షిర్కేకు చెందిన ఇద్దరు మహిళలతో పాటు పలువురి వద్ద రూ.50 లక్షలకు పైగా తీసుకొని మోసం చేశాడు. దీంతో అతనిపై మంచిర్యాల, సీసీసీ నస్పూర్, మందమర్రి పోలీస్​స్టేషన్లలో 2019 నుంచి  2021 జూన్​ వరకు పలు కేసులు నమోదు చేశారు. 19 జులై  2021న పీడీ యాక్ట్​ నమోదు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన మహేశ్వర్​రావు తిరిగి ఏప్రిల్​2022లో సింగరేణి డ్యూటీలో చేరాడు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి మోసం చేశాడు.