
గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థ భూగర్భ గనులు, ఓపెన్కాస్ట్ప్రాజెక్టుల్లో యంత్రాల పని గంటలు పెంచడంపై దృష్టి సారించింది. నిర్దేశించిన పని గంటల కన్నా తక్కువగా పని చేస్తుండడంతో, బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తోంది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో లాభాలు తగ్గే అవకాశం ఉంది. ఈక్రమంలో కంపెనీ స్థితిగతులపై ఉద్యోగులు, కార్మికులకు అవగాహన కల్పించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. సింగరేణి వ్యాప్తంగా మంగళవారం నుంచి అన్ని గనులు, ఓపెన్ కాస్ట్‌లలో మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ మీటింగ్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
టార్గెట్ రీచ్ కాలే..
సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌గా నిర్ణయించుకుంది. అండర్‌గ్రౌండ్ మైన్లలో 7.10 మిలియన్ టన్నులు, ఓపెన్‌కాస్ట్‌లలో 64.90 మిలియన్‌టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో భూగర్భ గనుల్లో 63 శాతం, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌ల్లో 101 శాతం బొగ్గు ఉత్పత్తి చేశారు. నాలుగు నెలల్లో 20.82 మిలియన్ టన్నులకు గాను, 20.19 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి 97 శాతం టార్గెట్ సాధించారు.
ఎస్డీఎల్ మెషీన్లు 6 గంటలే పని చేస్తున్నయ్..
సింగరేణి వ్యాప్తంగా 21 అండర్‌గ్రౌండ్ మైన్లు ఉండగా, 16 గనుల్లో సైడ్డిస్పాచ్లోడర్(ఎస్డీఎల్) యంత్రాలు పని చేస్తున్నాయి. సింగరేణిలో తట్ట, చమ్మస్విధానానికి పూర్తిగా స్వస్తి పలికిన తరువాత మేనేజ్మెంట్ ఈ యంత్రాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం సింగరేణిలో 157 యంత్రాలు పని చేస్తున్నాయి.
వీటిలో ఒక యంత్రం 24 గంటల్లో సరాసరి 6 గంటలు పని చేస్తూ రోజుకు 89 టన్నుల బొగ్గును వెలికి తీస్తున్నాయి. 2008–-09లో ఒక్కో యంత్రం ఎనిమిదిన్నర గంటలు పని చేసి 142 టన్నులు, 2018–19లో ఏడున్నర గంటలు పని చేసి 105 టన్నుల బొగ్గును వెలికితీశాయి. ప్రస్తుతం ఎస్డీఎల్ మెషీన్ ఆరు గంటలు మాత్రమే పని చేస్తుండడంతో మేనేజ్మెంట్ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఓపెన్ కాస్ట్ల్లోనూ అదే పరిస్థితి..
ఓపెన్ కాస్ట్ల్లోనూ యంత్రాల పని గంటలు తగ్గాయి. 66 షావెల్ యంత్రాలు రోజుకు 20 గంటలు పని చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ, 13 గంటలు మాత్రమే నడిపిస్తున్నారు. 417 డంపర్లు 19 గంటలకు బదులుగా, 10 గంటలు, 103 డోజర్లు 16 గంటలకు బదులుగా 5 గంటలు, 48 డ్రిల్స్ 20 గంటలకు బదులుగా 7 గంటలు మాత్రమే నడిపిస్తున్నట్లు తేలింది. యంత్రాల పని గంటలను కొంత మేరకు పెంచితే మరింత బొగ్గు ఉత్పత్తి సాధించే అవకాశం ఉంటుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.
భూగర్భ గనుల్లో లాభాలు రావట్లే..
సింగరేణి భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతోంది. గత సంవత్సరం భూగర్భ గనుల్లో 48.07 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశారు. టన్ను బొగ్గు వెలికితీతకు రూ.9,466 ఖర్చయింది. టన్ను బొగ్గు అమ్మితే రూ.4,864 మాత్రమే వచ్చాయి. దీంతో ఒక్కో టన్నుకు రూ.4,602 చొప్పున రూ.2,212 కోట్ల నష్టం వచ్చింది. అండర్ గ్రౌండ్ మైన్ల నుంచి వస్తున్న డబ్బులు అక్కడి కార్మికుల జీతభత్యాలకు కూడా సరిపోవడం లేదని స్పష్టమవుతోంది.
సింగరేణిలో మెషీన్లను పూర్తి కెపాసిటీతో నడపాలి
కోల్‌బెల్ట్/నస్పూర్, వెలుగు: సింగరేణి స్థితిగతులపై కార్మికులు,ఉద్యోగులకు మల్టీ డిపార్ట్మెంట్ కమిటీల ద్వారా అవగాహన కల్పిస్తామని మందమర్రి, శ్రీరాంపూర్సింగరేణి జీఎంలు జి.దేవేందర్, ఎం.శ్రీనివాస్అన్నారు. సోమవారం మందమర్రి, శ్రీరాంపూర్జీఎం ఆఫీసుల్లో మీడియాతో మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా అండర్‌గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ మైన్లలోని మెషీన్లు చేయాల్సిన పనిగంటల కన్నా తక్కువగా పనిచేస్తున్నాయని, ఫలితంగా బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు.
ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల లాభాలు తగ్గే అవకాశం ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, మెషీన్ల పనిగంటలు, ఉత్పత్తి వ్యయం, లాభాలు తదితర అంశాలపై కార్మికులు, ఉద్యోగులకు యూజీ, ఓపెన్కాస్ట్గనులపై మల్టీడిపార్ట్మెంటల్కమిటీల ద్వారా మంగళవారం నుంచి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం వివిధ విభాగాల ఉన్నతాధికారులు, గుర్తింపు సంఘం లీడర్లతో జీఎంలు రివ్యూ
నిర్వహించారు.
పని గంటలు పెంచితేనే మనుగడ..
వివిధ కారణాలతో బొగ్గు వెలికితీసే యంత్రాల పని గంటలు తగ్గుతున్నాయి. ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీ మెషీన్లు 12 గంటలు నడిపించాలి. ఏడు గంటలు మాత్రమే నడిపించడం వల్ల బొగ్గు ఉత్పత్తి వ్యయం పెరిగి లాభాలు తగ్గుతున్నాయి. యంత్రాల పని గంటలు పెంచి, ఉత్పత్తి ఖర్చు తగ్గించుకుంటేనే సింగరేణికి మనుగడ ఉంటుంది. కంపెనీ స్థితిగతులపై కార్మికులకు అవగాహన కల్పించేందుకు అవేర్నెస్ మీటింగ్‌లు పెడుతున్నాం.
- డి.లలిత్ కుమార్, జీఎం, ఆర్జీ–1