సింగరేణిలో ఆపరేటర్లుగా మహిళలు..దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

సింగరేణిలో ఆపరేటర్లుగా మహిళలు..దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
  • ఓఎంసీల్లో సింగరేణి రిక్రూట్ మెంట్ 
  • సంస్థ చరిత్రలో తొలిసారిగా నియామకం 
  • మహిళా జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లతో భర్తీ  
  • ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానిస్తోన్న సంస్థ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఓపెన్​కాస్ట్ మైన్స్(ఓఎంసీ) ప్రాజెక్టుల్లో మహిళా ఆపరేటర్లను నియమించాలని సంస్థ నిర్ణయించింది. బొగ్గు ఉత్పత్తిలో ఓఎంసీలదే కీ రోల్. ఇందులో మెషీన్ల ద్వారా బొగ్గు ను వెలికితీస్తారు. ఇక ముందు భారీ మెషీన్లపై ఆపరేటర్లు(డ్రైవర్లు)గా మహిళా కార్మికులను సింగరేణి రిక్రూట్ చేసుకునేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు శనివారం సర్క్యూలర్​ను జారీ చేసింది. 

 సింగరేణిలో తొలిసారిగా..

135 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణిలో తొలిసారిగా ఓపెన్​కాస్ట్ మైన్స్(ఓఎంసీ)లో మహిళా ఆపరేటర్లను నియమించుకోనుంది. వీరంతా ఓఎంసీల్లో భారీ మెషీన్లపై పనిచేయాల్సి ఉంటుంది. బొగ్గు ఉత్పత్తి దాదాపు ఓఎంసీల నుంచే 70శాతానికి పైగా జరుగుతుంది. ఇప్పటి వరకు పురుషులు మాత్రమే పని చేస్తున్నారు. ఇదే విషయమై కొద్ది రోజుల కింద సింగరేణి సీఎండీ ఎన్​. బలరాం మహిళా కార్మికులతో చర్చించారు.  ఆపరేటర్లుగా పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు కొందరు మహిళలు చైర్మన్ ​దృష్టికి తీసుకెళ్లారు.  దీంతో ఇంట్రస్ట్​ ఉన్న మహిళా ఉద్యోగులను ఆపరేటర్లుగా నియమించేందుకు నిర్ణయించారు.  

దరఖాస్తుల ఆహ్వానం 

సింగరేణివ్యాప్తంగా మైన్స్, డిపార్ట్​మెంట్లలో దాదా పు 2,120 మంది వరకు మహిళా కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో 600 నుంచి 800 మంది వరకు ప్రొడక్షన్​విభాగంలో ఉన్నారు. ఇప్పటికే పూర్తిగా మహిళా కార్మికులతో ఒక మైన్​లో ఒక షిఫ్ట్​ను నడుపుతున్నారు. అది సక్సెస్  అయితే మరో మైన్​కూడా మహిళలకు కేటాయించాలని  ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగా మరో కొత్త  ప్రోగ్రామ్ కు సీఎండీ శ్రీకారం చుట్టారు. 

మహిళా ఉద్యోగులను ఓపెన్​కాస్ట్ మైన్స్ లో ఆపరేటర్లుగా నియమించేందుకు అవసరమైన సర్క్యూలర్ ను సింగరేణిలోని అన్ని ఏరియాలకు పంపించారు. సంస్థలోని మహిళా జనరల్​అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లకు అవకాశం ఇవ్వనున్నారు. భారీ మెషీన్లపై ఆపరేటర్లుగా పనిచేసేందుకు అర్హుతలు, ఆసక్తి కలిగిన మహిళా ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలంటూ ఉత్తర్వులు  జారీ చేశారు. జనరల్ అసిస్టెంట్, బదిలీ వర్కర్స్​గా పని చేస్తూ 35 ఏండ్లలోపు ఉండి, ఏడో తరగతి ఉత్తీర్ణులైన మహిళా ఉద్యోగులు అర్హులుగా పేర్కొన్నారు.  దరఖాస్తు చేసుకునే మహిళలు శారీరక సామర్థ్యం కలిగి ఉండాలని, టూ వీలర్ లేదా ఏదేని ఫోర్ ​వీలర్​వెహికల్​ డ్రైవింగ్​ లైసెన్స్​ ఉండాలని ఉత్తర్వుల్లో సూచించారు.  2024 ఆగస్టుకు ముందు డ్రైవింగ్​ లైసెన్స్ ​పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఎంపిక ఇలా..

 ఓపెన్​కాస్ట్ మైన్స్ లో  ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న మహిళా జనరల్​అసిస్టెంట్లు, బదిలీ వర్కర్స్​ తాము పని చేస్తున్న ఏరియాలోని మైన్​మేనేజర్​కు కానీ ఏరియా జీఎం ఆఫీస్​లో కానీ దరఖాస్తులు చేసుకోవాలి. అప్లికేషన్లను చీఫ్ ప్లానింగ్​ప్రాజెక్ట్​ నేతృత్వంలోని కమిటీ పరిశీంచనుంది. కనీస అర్హతలు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకోనుంది. అనంతరం సిరిసిల్లాలోని తెలంగాణ ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ డ్రైవింగ్​ ఎడ్యుకేషన్​ అండ్​స్కిల్స్​ సంస్థ హెవీ గూడ్స్ వెహికల్​, హెవీ మోటార్​ వెహికల్ ​విభాగంలో ట్రైనింగ్​కు పంపించనుంది. 

శిక్షణ అనంతరం ఖాళీలను బట్టి మరోసారి ఎగ్జామ్​ నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ఈపీ ఆపరేటర్​ట్రైనీ కేటగిరి ‌‌‌‌‌‌‌‌‌‌‌‌–5 గా నియమించనుంది.  సెలెక్ట్​ అయిన వారితో మొదటగా గ్రేడర్లు, షావెల్స్, డోజర్లు, వాటర్​ ట్యాంకర్ల వంటి వెహికల్స్​ను నడిపిస్తారు. అందులో మెరుగైన ప్రతిభ చూపినవారిని డంపర్లను నడిపేందుకు రిక్రూట్ చేసుకుంటుంది.  

సంస్తలో మహిళా సాధికారతే లక్ష్యం

మైనింగ్ రంగంలో మహిళా సాధికారతే లక్ష్యంగా కంపెనీలోని మహిళా జనరల్​అసిస్టెంట్లు, బదిలీ వర్కర్స్​కు ఓఎంసీల్లో ఆపరేటర్లుగా పనిచేసేందుకు నియామకాలు చేస్తున్నాం. ఆర్మీతో పాటు అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారు. సింగరేణిలోనూ ఓఎంసీల్లో పురుషులతో పాటు ఆపరేటర్లుగా మహిళలకు అవకాశమివ్వాలని నిర్ణయం తీసుకున్నాం.  సంస్థకు చెందిన మహిళా జనరల్​ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లు సద్వినియోగం చేసుకోవాలి. ‌‌‌‌‌‌‌‌

- ఎన్​.బలరాం, సింగరేణి  సీఎండీ