సింగరేణి పెట్రోల్ బంకులు... సంస్థ ఖాళీ స్థలాల్లో ఏర్పాటుకు నిర్ణయం

సింగరేణి పెట్రోల్ బంకులు... సంస్థ ఖాళీ స్థలాల్లో ఏర్పాటుకు నిర్ణయం
  • ఇంధన సంస్థలతో కుదిరిన ఎంవోయూ
  • వచ్చే ఏడాది మేలోపు ప్రారంభానికి చర్యలు 
  • ఆక్రమణల నుంచి సంస్థ స్థలాల పరిరక్షణ  
  • స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు

కోల్​బెల్ట్​, వెలుగు : బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్, సోలార్ పవర్​జనరేషన్​చేసే సింగరేణి పెట్రోల్,​ డీజిల్​బంకుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. సంస్థ అవసరాలు, ఉద్యోగులు, కార్మికులతో పాటు గనుల సమీప ప్రాంతాల ప్రజలకు సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది.  ఇండియన్​ఆయిల్​కార్పొరేషన్, హిందూస్థాన్​పెట్రోలియం కార్పొరేషన్, భారత్​ పెట్రోలియం కార్పొరేషన్లతో యాజమాన్యం ఎంవోయూ చేసుకుంది.  బంకుల ఏర్పాటు కోసం  సంస్థ స్థలాలను  ఇంధన సంస్థలకు లీజ్​కు ఇవ్వనుంది. 

ఖాళీ స్థలాలను కాపాడుకునేందుకు..

నాణ్యమైన పెట్రోలు, డీజిల్​ను సూపర్​బజార్ల ఆధ్వర్యంలో పంపిణీ చేసేందుకు 2016 లోనే సింగరేణి నిర్ణయం తీసుకుంది. సంస్థ ఆఫీసర్లు కూడా కసరత్తు చేసి స్థలాల సేకరణ చేపట్టారు. ఇంధన సంస్థలు కూడా బంకుల ఏర్పాటు కు ఆసక్తి చూపాయి. అనంతరం ఏమైందో తెలియదు, ఆఫీసర్ల మాత్రం పనులను పక్కన పెట్టేశారు. సీఎండీగా ఎన్​. బలరాం నాయక్ వచ్చిన తర్వాత సంస్థ ఖాళీ స్థలాల్లో పెట్రోల్​బంక్​ల ఏర్పాటుపై మళ్లీ దృష్టి పెట్టారు. 

సింగరేణివ్యాప్తంగా సంస్థకు విలువైన ఖాళీ స్థలాలు ఉండగా అన్యాక్రాంతమవుతుండగా.. వాటిని రక్షించుకునేందుకు, పెట్రోల్​బంకులకు లీజుకిస్తే ఆదాయంతో వస్తుందనే ఆలోచనతో సింగరేణి చర్యలు చేపట్టింది. పెట్రోల్ అమ్మకాలపై సంస్థకు కొంత మొత్తం కమీషన్​ కూడా రానుంది. మరోవైపు ఓపెన్​కాస్ట్ ప్రాజెక్టుల్లో  తన అవసరాలకు యాభై ఏండ్ల కిందటే డీజిల్​ బంకులు ఏర్పాటు చేసింది. ఓసీపీల్లో పనిచేసే మెషీన్లలో భారీగా డీజిల్​అవసరం అవుతుంది. ఇంధన సంస్థల నుంచి  కొనుగోలు చేసి సొంత పెట్రోల్​ బంకుల్లో ఫిల్లింగ్​ చేస్తోంది.  

ఏడు ప్రాంతాల్లో బంకుల ఏర్పాటు

రాష్ట్ర సర్కార్ ఆదేశాలతో సీఎండీ ఎన్​.బలరాం నాయక్​ నేతృత్వంలో సంస్థకు చెందిన ఖాళీ స్థలాల్లో  7 చోట్ల పెట్రోల్​బంకులను ఇంధన సంస్థల సహకారంతో నిర్మించనుంది. ఇప్పటికే స్థలాలను కూడా కేటాయించింది. కలెక్టర్​, ఆర్డీవో  ఎన్​వోసీ ఇచ్చిన తర్వాత ఇంధన సంస్థలకు అప్పగించనుంది.

హెచ్​పీసీఎల్​ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి టౌన్ లో నేషనల్​హైవే –363 పక్కన కేకే –2 ఓసీపీ సమీపంలోని నర్సరీ వద్ద, బెల్లంపల్లి టౌన్ లో, పెద్దపల్లి జిల్లా రామగుండం–-1 ఏరియాలోని రాజీవ్​నేషనల్ హై వే పక్కన, కొత్తగూడెం ఆదివారం సంత ఏరియాల్లో ఏర్పాటు చేయనుంది. బీపీసీఎల్​ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం–-2 పరిధి రెడ్డి కాలనీ, ఖమ్మం జిల్లాలోని మణుగూరు ఏరియాలో – 33 కేవీ సబ్​స్టేషన్​ఎదుట, ఐసీవోఎల్​ఆధ్వర్యంలో రామగుండం-– 2 ఏరియాలోని పాత హెచ్​పీ పెట్రోల్​బంకు వద్ద నిర్మించేందుకు ప్రతిపాదించింది. 

స్థానిక యువతకు ఉపాధికి చాన్స్

బంకుల నిర్మాణ వ్యయాన్ని  ఇంధన సంస్థలే భరిస్తాయి. ఒక్కో బంకు ఏర్పాటుకు 1,076 చదరపు అడుగుల స్థలాన్ని సింగరేణి ఇవ్వనుంది.  నాగ్​పూర్​లోని ఎక్స్ ప్లోజివ్ ఆఫీస్లు నుంచి పర్మిషన్​ తీసుకో వాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్రమం గా జరిగితే వచ్చే ఏడాది మే లో బంకులు ప్రారంభ మవుతాయి. ఒక్కొ క్క దానికి  సుమారు 1.57 కోట్లు దాకా ఖర్చువుతుంద ని సింగరేణి ఆఫీసర్లు పేర్కొంటున్నారు.  పెట్రోల్​బంకుల ద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.  భవిష్యత్​లో మరిన్న ప్రాంతాల కు బంకులు విస్తరించేలా కూడా యాజమాన్యం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.