సింగరేణి లాభాల వాటాపై రగడ

సింగరేణి లాభాల వాటాపై రగడ
  • గడువు దాటినా వాటా చెల్లించని మేనేజ్ మెంట్
  • ఎన్నికల కోడ్​పేరుతో వాయిదా
  • కొత్త నిబంధనలపై కార్మికుల ఆందోళన
  • సమ్మెకు సిద్ధం కావాలని కార్మిక సంఘాల పిలుపు

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి లాభాల వాటా పంపిణీపై గందరగోళం నెలకొంది. ఈనెల 16న కార్మికులకు లాభాల వాటాను పంపిణీ చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్​ అమల్లోకి రావడంతో వాటాను పంపిణీ చేయలేమని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. దీనిపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వాటాను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేస్తూ అన్ని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తుండడంతో రగడ మొదలైంది. ఎన్నికల కోడ్​తో సంబంధం లేకుండా సంస్థ సాధించిన లాభాల్లో 32శాతం కార్మికుల వాటాగా రూ.711 కోట్లు, రూ.25 వేల దసరా అడ్వాన్స్​ చెల్లించాలని డిమాండ్​చేస్తూ కార్మిక సంఘాలు బొగ్గు గనుల్లో సమ్మెకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ సంఘాలు సమ్మెకు సిద్ధమవడం సింగరేణికి మింగుడు పడని ఆంశంగా మారింది. మరోవైపు  కార్మికులు టూల్ డౌన్​, ఆఫీస్​ సిబ్బంది పెన్ డౌన్​ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో వాటా చెల్లింపుపై క్లారిటీ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

కోడ్ సాకుతో వాయిదా వేయడం కరెక్టు కాదు

యాజమాన్యం నిర్ణయంపై కార్మికులు తీవ్రంగా మండిపడుతున్నారు. కంపెనీకి సంబంధించిన లాభాలు కార్మికులకు పంపిణీ చేయడం సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయమని, ఎన్నికల కోడ్​ పేరుతో వాయిదా వేయడం సరికాదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. లాభాల వాటా కార్మికులు సాధించుకున్న  హక్కు అని, దీనికి సర్కారుతో ఎలాంటి సంబంధం ఉండదని చెబుతున్నారు. లాభాల వాటా, దసరా అడ్వాన్స్​ రాకపోవడంతో  తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరాను ఎలా జరుపుకుంటామని ప్రశ్నిస్తున్నారు.  గతంలో అనేక సార్లు ఎన్నికల సమయంలో లాభాల వాటా పంపిణీ  చేశారని గుర్తుచేశారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్​ తీరుతోనే ఇలా జరుగుతున్నదని వారు ఫైరయ్యారు. మరోవైపు ఈనెల 16న లాభాల వాటా చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. అన్ని  సంఘాల పిలుపుతో కార్మికులు సోమవారం సింగరేణివ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియా ఇందారం -1ఏ గని, ఇందారం ఓసీపీ గనులపై బీజేపీ, బీఎంఎస్​ లీడర్లు, కార్మికులు మెకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. సమ్మె చేసేందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలని సంఘాలు  పిలుపునిచ్చాయి.

దసరాకు ముందే చెల్లిస్తారు

కార్మికులు ఏటా కష్టపడి సాధించే బొగ్గు ఉత్పత్తిపై వచ్చే వార్షిక ఆదాయంపై ప్రతి సంవత్సరం కొంత వాటాను పంపిణీ చేయడం సింగరేణిలో ఆనవాయితీగా వస్తోంది. ఇతర ఏ ప్రభుత్వ రంగ సంస్థలో ఈ విధానం లేదు. సింగరేణిలో 1999 నుంచి ఈ పద్ధతి కొనసాగుతోంది. ఏటా దసరాకు ముందు లాభాల వాటాతో పాటు దీపావళి ముందు పీఎల్ఆర్​ బోనస్​ పంపిణీ చేస్తారు. సింగరేణి సంస్థ 2022-–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలు ఆర్జించింది. దీనిపై కార్మికులకు 32 శాతం వాటాగా రూ.711 కోట్లు చెల్లించాలని సెప్టెంబర్​ 26న నిర్ణయించారు. ఈ వాటాను అక్టోబర్​16న చెల్లిస్తామని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. హాజరు, వ్యక్తిగత, గ్రూప్​ ప్రతిభ లెక్కల ప్రకారం కార్మికులకు వాటా చెల్లిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. గడువు ప్రకారం ఈనెల 16న లాభాల వాటాను కార్మికులకు చెల్లించాల్సి ఉండగా ఎప్పుడూలేని విధంగా ఎన్నికల కోడ్​పేరుతో యాజమాన్యం పంపిణీని వాయిదా వేసింది. అలాగే దసరా పండుగ అడ్వాన్స్​గా ఒక్కో కార్మికుడికి రూ.25 వేలను ఈనెల 20న చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈనెల 9న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చింది. ఈ సాకు చూపి లాభాల వాటాను చెల్లించలేమని సింగరేణి యాజమాన్యం ఓ సర్క్యులర్ ను విడుదల చేసింది. ఎన్నికల సంఘంతో మాట్లాడి పర్మిషన్​ తీసుకున్న తర్వాత వాటా చెల్లింపు ఎప్పుడనే విషయాన్ని  ప్రకటిస్తామని పేర్కొంది.