ఇయ్యాల్టి నుంచే  సింగరేణి కార్మికుల సమ్మె

ఇయ్యాల్టి నుంచే  సింగరేణి కార్మికుల సమ్మె
  • 3 రోజులు బొగ్గు గనుల్లో ఉత్పత్తి బంద్​

మందమర్రి, వెలుగు: రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలంను వ్యతిరేకిస్తూ సింగరేణిలోని గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్ తోపాటు ఐదు జాతీయ, ఇతర కార్మిక సంఘాలు సమ్మెకు రెడీ అయ్యాయి. గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు సింగరేణిలోని 26 అండర్ గ్రౌండ్ మైన్స్,19 ఓసీపీల పాటు వివిధ డిపార్ట్​మెంట్లలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు స్ట్రైక్​లో పాల్గొననున్నారు. ఇప్పటికే కార్మిక నేతలు సమ్మెపై విస్తృతంగా ప్రచారం చేశారు. ఈసారి అన్ని కార్మిక సంఘాలు ఏకమవ్వడంతో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
10 రోజులుగా ప్రచారం
సమ్మెను సక్సెస్​చేయాలని టీబీజీకేఎస్​తోపాటు జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్ఎంఎస్​నాయకులు బొగ్గు గనుల్లో పది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకించకపోతే ఫ్యూచర్​లో సింగరేణి ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమ్మెతో 4బొగ్గు బ్లాకులను తిరిగి సింగరేణి కంపెనీకే కేటాయించేలా కేంద్ర సర్కార్​పై ఒత్తిడి తీసుకురావచ్చని చెబుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా 43 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎమర్జెన్సీ సిబ్బంది మినహా బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే మోజారిటీ కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు.  సమ్మెతో గనుల్లోంచి ఒక్క బొగ్గు పెళ్ల కూడా బయటకు వచ్చే వీలుండదని తెలుస్తోంది. 
రోజుకు రూ.60 కోట్ల నష్టం
3 రోజుల పాటు సమ్మె కొనసాగితే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది. 45 బొగ్గు గనుల ద్వారా డైలీ 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. వివిధ గ్రేడుల బొగ్గు ఒక్కో ధరకు అమ్ముడవుతున్నప్పటికీ.. మొత్తంగా టన్ను బొగ్గు సగటున రూ.3,200 పలుకుతోంది. కోల్​బెల్ట్​ వ్యాప్తంగా ప్రొడక్షన్​ స్తంభింపజేస్తే సంస్థకు రోజుకు రూ.60 కోట్లు లెక్కన మూడు రోజులకు రూ.180కోట్లు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అలాగే 43 వేల మంది కార్మికులు వేతనాల రూపంలో రూ.60 కోట్ల వరకు నష్టపోనున్నారు. 
ఆర్ఎల్​సీతో చర్చలు విఫలం
బొగ్గు బ్లాక్​ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గురువారం నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేసి తీరుతామని కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు ఆర్ఎల్ సీ(రీజనల్​ లేబర్​కమిషనర్) ఎదుట తేల్చి చెప్పారు. బుధవారం రాత్రి వరకు హైదరాబాద్​లోని లేబర్ కమిషనర్​ నేతృత్వంలో సింగరేణి యాజమాన్యం, ఆరు కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చట్టం వచ్చిన తర్వాత 113 బొగ్గు బ్లాక్​లను డైరెక్ట్​గా కోలిండియాకు ఎట్లా ఇచ్చారని జేఏసీ ప్రశ్నించింది. ఒడిశా, జార్ఘండ్, చత్తీస్​గఢ్​, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర సీఎంల విజ్ఞప్తి మేరకు బ్లాకులను కేటాయించిందని యాజమాన్యం చెప్పుకొచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు బొగ్గు బ్లాక్​లను అడగలేదని జేఏసీ ప్రశ్నించింది. సీఎం బొగ్గు బావుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం దురదృష్టకరమని చెప్పింది. ఎలాంటి సంబంధం లేకపోతే అన్ని విషయాలు సీఎం చెప్పినట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్​ ఎందుకు చేస్తున్నారని జేసీఏ లీడర్లు నిలదీశారు. గురువారం సాయంత్రం 3 గంటలకు మరోసారి చర్చలు రావాలని యాజమాన్యం ఆహ్వానించింది. 

సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం బాధాకారం
గోదావరిఖని: కోల్ బ్లాక్​వేలంను నిరసిస్తూ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చి పోరాడుతుంటే కార్మికుల ఓట్లపై గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు కనీసం స్పందించకపోవడం బాధాకరమని ఏఐటీయూసీ జనరల్‌‌సెక్రెటరీ వి.సీతారామయ్య అన్నారు. వాళ్లు గనుల వైపు వస్తే తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. బుధవారం ఆయన గోదావరిఖనిలోని యూనియన్‌‌ ఆఫీస్‌‌లో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల సీఎంలు వారి ప్రాంతాల్లోని బొగ్గు గనులను ప్రైవేట్​ చేయొద్దని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కాపాడుకుంటుంటే సీఎం కేసీఆర్ తోపాటు, కోల్ బెల్ట్​లోని ప్రజాప్రతినిధులు కనీసం స్పందించకపోవడం దారుణం అన్నారు. మూడు రోజుల సమ్మెలో ప్రతిఒక్క కార్మికుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు.