పంజాగుట్ట, వెలుగు: తనపై తప్పుడు ప్రచారం చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడంటూ న్యాయవాది సింగపోగు సుబ్బారావుపై సింగర్ మంగ్లీ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆమె.. సుబ్బారావు తన పేరు వాడుకుని ఫేమస్ కావాలని, తద్వారా బిగ్ బాస్ షోలోకి వెళ్లాలని చూస్తున్నాడని ఆరోపించారు.
ఫైనాన్స్ మోసం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తి తన తమ్ముడు కూడా కాదని మంగ్లీ స్పష్టం చేశారు. పాటలే తన ప్రపంచమని, అనవసరంగా తనను, తన కుటుంబాన్ని వివాదాల్లోకి లాగొద్దని కోరారు. తప్పుడు ఆరోపణలు చేసి లబ్ధి పొందాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

