సింగర్​ వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత

సింగర్​ వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
  •     అనారోగ్యంతో స్వగృహంలో తుదిశ్వాస
  •     గబ్బర్ సింగ్ లో ‘గన్నులాంటి కన్నులున్న’ పాటతో ఫేమస్

సింగర్​ వడ్డేపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (64) కన్నుమూశారు. గబ్బర్​సింగ్​లోని ‘గన్నులాంటి కన్నులున్న’, ఎర్రోడు సినిమాలోని ‘ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు’ వంటి పాటలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. 

పద్మారావునగర్/సికింద్రాబాద్, వెలుగు: ప్రముఖ జానపద, సినీ నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌‌  (64) కన్నుమూశారు. గురువారం ఉదయం సికింద్రాబాద్‌‌ లోని సీతాఫల్‌‌మండి డివిజన్‌‌  శ్రీనివాసనగర్‌‌లో తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్య సహాయం పొందలేకపోయారు. 1960 జులై 4న పాతబస్తీలోని గోల్కొండ మోతీ దర్వాజా ప్రాంతంలో ఆయన జన్మించారు. 

తండ్రి బుద్దయ్య నారాయణరావు ఆయుర్వేదిక్   డాక్టర్. తల్లి యశోద గాయకురాలు. తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో పాటలపై ఇష్టం పెంచుకున్న శ్రీనివాస్.. మూడువేలకు పైగా జానపద పాటలు పాడారు. కొన్ని వందల జానపద గీతాలు రచించారు. ఆయనకు భార్య ఇందిర, కుమార్తె మాసన ఉన్నారు. జానపద పాటల రచయిత, గాయకుడిగా ఎంతో గుర్తింపు  పొందిన ఆయన. ‘నమస్తే అన్న’ చిత్రంలోని ‘గరం గరం పోరీ నా గజ్జల సవ్వారీ’ పాటతో నేపథ్య  గాయకుడిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించారు. ఎర్రోడు సినిమాలో ‘ఏం తినేటట్టు లేదు.. ఏం కొనేటట్టు లేదు’, నాగార్జున నటించిన కింగ్‌‌  మూవీలో ‘గింత గింత బాల సుక్కవే’ పాట పాడారు. పవన్‌‌  కల్యాణ్‌‌  గబ్బర్‌‌ సింగ్‌‌  సినిమాలో ‘గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా.. పిల్లా నువ్వులేని జీవితం’ పాటతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాటకు 2012లో ఉత్తమ ప్లే బ్యాక్  సింగర్ ఫిలింఫేర్‌‌  అవార్డు సాధించారు. 

ఆయన చేసిన స్టేజ్‌‌ షోలు, ప్రదర్శనలు, జానపద గీతాల ప్రైవేటు ఆల్బమ్స్‌‌ విశేష జనాదరణ పొందాయి. కాగా జానపద, సినీ నేపథ్య గాయకులను మరింత ప్రోత్సహించేందుకు 2010లో ఇందిరా పార్కు వద్ద ఏర్పాటు చేసిన శ్రీదుర్గా ఆడియో, వీడియో రికార్డింగ్‌‌  థియేటర్‌‌  అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో దాదాపు  రూ.50 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన సన్నిహితులు తెలిపారు. అప్పటి నుంచి శ్రీనివాస్  ను కష్టాలు వెంటాడాయి. దీంతో ఆయన ఆర్థికంగా చితికిపోయారు.   ఆయన కుమార్తె మానస  ఫోక్‌‌  డిప్లొమాలో గోల్డ్‌‌ మెడల్‌‌ సాధించి కొరియోగ్రాఫర్‌‌గా పనిచేస్తున్నారు. సీతాఫల్‌‌మండి హిందు శ్శశానవాటికలో గురువారం సాయంత్రం శ్రీనివాస్​ అంత్యక్రియలు నిర్వహించారు. సంగీత దర్శకుడు విష్ణుకిశోర్, జానపద కవి, గాయకుడు నేర్నాల కిశోర్, గాయకులు స్వర్ణక్క, బోనాల ప్రకాశ్, సంపత్, సన్నిహితులు హాజరయ్యారు.