రైతు నిరసనల వద్ద మరో వ్యక్తి దారుణ హత్య

రైతు నిరసనల వద్ద మరో వ్యక్తి దారుణ హత్య

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న ప్రదేశంలో శుక్రవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చేతులను బారీకేడ్ లకు కట్టేసి.. కత్తితో మణికట్టు కోసి చంపారు. సింఘు సరిహద్దులో ఈ ఘటన వెలుగుచూసింది. హత్యకు గురైన 35 ఏళ్ల వ్యక్తిని లఖ్‌బీర్ గా గుర్తించారు. ఈ హత్యకు తామే బాధ్యులమని నిహాంగ్ ల బృందం ప్రకటించింది. తమ పవిత్ర ‘సర్బలోహ్ గ్రంథ్’ని లఖ్‌బీర్ కాల్చడానికి ప్రయత్నించడం వల్లే ఈ హత్య చేశామని నిహాంగులు తెలిపారు.

ఈ హత్యను సంయుక్త్ కిసాన్ మోర్చా ఖండించింది. లఖ్‌బీర్ మరియు నిహాంగ్ గ్రూపుకు సంయుక్త్ కిసాన్ మోర్చాతో ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. సంయుక్త్ కిసాన్ మోర్చా అనేది ఏదైనా మతపరమైన గ్రంథం లేదా చిహ్నానికి వ్యతిరేకమని.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ ఏ మతం ఇవ్వదని వారు చెప్పారు.  చట్ట ప్రకారం నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నట్లు సంయుక్త్ కిసాన్ మోర్చా ప్రతినిధులు డిమాండ్ చేశారు.