
- సిలబస్, క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం
- ఇందులో పోలీస్ శాఖలో 14 వేలు, ఇంజనీర్ల పోస్టులు 2 వేలు
- గ్రూప్ 3, 4లో వెయ్యి దాకా పోస్టులు.. మరిన్ని పెరిగే చాన్స్
- డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7 వేల జీపీవో పోస్టులు
- జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు గ్రూప్3, 4కు వేర్వేరుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా.. ఇకపై ఈ రెండింటికీ కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
గ్రూప్ 3, 4కు ఒకే సిలబస్, క్వాలిఫికేషన్(డిగ్రీ) ఉంది. కేవలం పోస్టింగ్ విషయంలోనే మార్పు ఉంది. గ్రూప్3 కింద రిక్రూట్ అయ్యేవాళ్లు హెచ్‌వోడీ కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతుండగా, గ్రూప్4 కింద రిక్రూట్అయ్యేవాళ్లు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటికీ కలిపి ఒక్కటే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.
ఇక త్వరలోనే దాదాపు 27 వేల ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకున్నది. వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వనుంది. ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల వివరాలను ఇప్పటికే తెప్పించుకున్నది. ఇందులో గ్రూప్ 1, 2 పోస్టులే తక్కువగా ఉన్నాయి.
ఈ రెండింటిలో కలిపి 130లోపు పోస్టులు మాత్రమే ఉన్నట్టు తెలిసింది. అయితే ఇటీవల గ్రూప్1, 2 పోస్టులను భారీగా భర్తీ చేయడంతోనే పెద్దగా ఖాళీలు ఏర్పడలేదు. ప్రభుత్వం పోయినేడాది గ్రూప్1 కింద 563, గ్రూప్2 కింద 783 పోస్టులను భర్తీ చేసింది. ఈ మధ్య కాలంలో రిటైర్మెంట్లు పెద్దగా కాలేదు. దీంతో ఖాళీలు ఎక్కువగా ఏర్పడలేదు. ఇక గ్రూప్3, 4లో మాత్రం దాదాపు వెయ్యి పోస్టులు ఉన్నట్టు ప్రాథమికంగా లెక్క తేల్చారు.
గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ 3, 4 పోస్టుల భర్తీ ఇటీవలే పూర్తయింది. అయితే అందులో భర్తీ కాని పోస్టులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. అవి కూడా కలిపితే ఇంకో వెయ్యి దాకా పోస్టులు ఉంటాయని అధికారులు అంటున్నారు. ఇక అత్యధికంగా పోలీస్ శాఖలో 14 వేల పోస్టులు ఉన్నట్టు తేల్చారు. ఇందులో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. జెన్‌కో, ట్రాన్స్‌కోతో పాటు వివిధ శాఖల్లో కూడా కలిపి దాదాపు 2 వేల ఇంజనీర్ల పోస్టులు ఉన్నట్టు గుర్తించారు.
ఇక ఇతర సర్వీసులు కలిపితే ఇంకో 2 వేలు ఉన్నట్టు వివిధ శాఖలు ఫైనాన్స్డిపార్ట్మెంట్కు లెక్కలు పంపాయి. ఇవి కాకుండా కొత్తగా జీపీవో (గ్రామ పాలనాధికారి) పోస్టులు దాదాపు 7 వేలు డైరెక్ట్రిక్రూట్మెంట్ కింద చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వివిధ శాఖల్లో అడ్జస్ట్అయిన వీఆర్‌వో, వీఆర్‌ఏల నుంచి దాదాపు 5 వేల పోస్టులు భర్తీ చేయనున్నారు. మిగిలినవి డైరెక్ట్ రిక్రూట్మెంట్కింద చేసేందుకు ఇప్పటికే సర్వీస్‌రూల్స్ సిద్ధం చేశారు.
జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్..
జాబ్క్యాలెండర్ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది. మేలో గ్రూప్–-2 నోటిఫికేషన్, జులైలో గ్రూప్3 నోటిఫికేషన్రావాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్‌ను షెడ్యూల్ చేయగా.. ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు, కొత్తగా ఏర్పడిన ఖాళీలను కలిపి ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి, జాబ్‌క్యాలెండర్‌ను రీషెడ్యూల్ చేయనున్నది.