- పర్సంటేజీ విధానం అమలుకు డిమాండ్
- తెలుగు రాష్ట్రాల్లో తప్ప దేశమంతా ఉందని వాదన
- ఇప్పటికే 23 థియేటర్లలో అమలు
- మిగతా థియేటర్లకు నో అంటున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్థియేటర్లలో పర్సంటేజీ విధానం తీసుకురావాలని, లేకపోతే మే1 నుంచి సినిమా హాల్స్బంద్ చేస్తామని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లు అల్టిమేటం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 450 సింగిల్స్క్రీన్థియేటర్లుండగా, హైదరాబాద్ లో 150 నడుస్తున్నాయి.
అయితే మల్టీప్లెక్సుల్లో పర్సంటేజీ విధానాన్ని అమలు చేస్తున్న నిర్మాతలు.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంటల్ విధానం పెట్టడంతో ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఫిలిం ఛాంబర్అసోసియేషన్ అంటోంది. సిటీలోని 23 థియేటర్ల ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానం కావాలని పట్టుబట్టడం, లేకపోతే సినిమాలు రిలీజ్చేసేది లేదనడంతో ఏప్రిల్3వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. ఇదే విధంగా మిగతా థియేటర్లకూ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా బాగా ఆడి కలెక్షన్లు వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు రెంటల్ ఆర్ పర్సంటేజీ రూల్స్ ప్రకారం.. ఏది ఎక్కువ వస్తే అది తీసుకుంటున్నారని, సినిమా బాగా ఆడకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందంటున్నారు.
ఐదేండ్లుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మల్టీప్లెక్సులతో పోటీపడలేక వెనుకబడిపోతున్నాయని, ఒకప్పుడు హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించిన థియేటర్లు ఇప్పుడు ఖాళీ సీట్లతో కనిపిస్తున్నాయని, అందుకే తమను కాపాడాలంటున్నారు. దీంతో పాటు ఒక సినిమా రిలీజ్ చేసిన తర్వాత దాన్ని 8 వారాల దాకా ఓటీటీలోకి తీసుకురాకుండా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల థియేటర్లకు జనాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.
- అసలేంటి రెంటల్, పర్సంటేజీ విధానం..
ప్రస్తుత తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంటల్ లేదా పర్సంటేజీ(మినిమమ్ గ్యారంటీ) విధానంపైనే సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడుస్తున్నాయి. ఇందులో థియేటర్ యజమాని ముందుగానే ఒక ఫిక్సుడ్అమౌంట్ను డిస్ట్రిబ్యూటర్‌కు చెల్లించి సినిమా ప్రదర్శన హక్కులు పొందుతాడు. సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈ మొత్తం డిస్ట్రిబ్యూటర్‌కు వెళ్లిపోతుంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్‌కు, ప్రొడ్యూసర్ కు భద్రత ఎక్కువగా ఉంటుంది.
కానీ, థియేటర్ యజమానికి మాత్రం రిస్క్ ఉంటోంది. కలెక్షన్లు తగ్గినా, ముందే నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాల్సి రావడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, ఓటీటీ ప్రభావంతో ప్రేక్షకులు తగ్గిపోవడం వంటి కారణాలతో ఎగ్జిబిటర్లు లాస్అవుతున్నారు. మల్టీప్లెక్సుల్లో మాత్రం పర్సంటేజీ (షేర్) విధానం అమలు చేస్తుండడంతో సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్లను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒక నిర్దిష్ట శాతంలో పంచుకుంటున్నారు.
కానీ, సింగిల్స్క్రీన్థియేటర్లకు ఇది వర్తింపజేయడం లేదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముంబై, ఢిల్లీ, నార్త్ ఇండియా మార్కెట్లలో పర్సంటేజీ విధానం అమలు చేస్తున్నారని, మన రాష్ట్రంలో కూడా అలాగే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదు. తమ పెట్టుబడులు భారీగా ఉంటాయని, ఈ పర్సంటేజీ విధానం వల్ల తమ డబ్బుల రికవరీ కష్టమవుతుందని అంటున్నారు.
- ఏప్రిల్ 30 లోగా నిర్ణయం తీసుకోకపోతే..
మార్చి11న బెంగళూరులో దక్షిణ భారత ఎగ్జిబిటర్ల సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల సింగిల్ స్క్రీన్లు పర్సంటేజీ విధానాన్ని అమలు చేస్తుండడంతో ఇక్కడ కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని తీర్మానించారు. ఇప్పటికే నగరంలోని 23 థియేటర్ల యాజమాన్యాలు పర్సంటేజీ విధానం అమలు చేస్తేనే సినిమాలు వేస్తామని, లేకపోతే వేసేది లేదని డిమాండ్‌చేసి సాధించుకున్నాయి.
వీరు మొదటి వారం 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం వసూళ్ల వాటా పొందుతున్నారు. దీంతో మిగతా ఎగ్జిబిటర్లు కూడా తమకూ ఇదే వర్తింపజేయాలని పోరాడుతున్నారు. ఈ నెల 30లోగా షేర్విధానం అమలు చేస్తూ నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని, టికెట్ ధరల నియంత్రణ, పన్నులు, విద్యుత్ చార్జీలపై సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు.

