మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్

మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సింగిల్ ఫేజ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గోవాలోని 40 స్థానాలకు, ఉత్తరాఖండ్ లోని 70 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. గోవాలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఉత్తరాఖండ్ లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

గోవాలో 40 సీట్లకు గానూ 301 మంది పోటీ పడుతున్నారు. మహిళలే ఉండే 105 పోలింగ్  బూత్ లను ఏర్పాటు చేశారు. సీఎం ప్రమోద్  సావంత్ , విపక్ష నేత దిగంబర్  కామత్ , మాజీ సీఎం లక్ష్మీకాంత్  పార్సేకర్  వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. తలైగావ్ లోని  15వ పోలింగ్ బూత్ లో గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, ఆయన భార్య రీతా శ్రీధరన్ ఓటు వేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజల్ని కోరారు గోవా గవర్నర్. గోవాలో అర్హులైన ఓటర్లు 11 లక్షల మంది ఉండగా.... సగటున ఒక బూత్ లో 672 మంది ఓటర్లే ఉన్నారు. ఇది దేశంలోనే అతి తక్కువ. వాస్కో అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 35,139 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్  శాతాన్ని పెంచడానికి పలు దుకాణాలు ప్రత్యేక రాయితీలను ప్రకటించాయి. హాట్ ఎయిర్  బెలూన్ లో షికారుకు, బంగీ జంపింగ్ కు డిస్కౌంట్ ఇస్తామని కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. ఓటు వేసిన వచ్చిన జంటలకు ప్రేమికుల దినోత్సవ ఆఫర్లు ఇస్తామని ఉత్తర గోవాలోని కొన్ని హోటళ్లు ఆఫర్లను ప్రకటించాయి.

ఉత్తరాఖండ్  లోని 70 అసెంబ్లీ స్థానాలకు 632 మంది అభ్యర్థులు బరిలో దిగారు. సుమారు 81 లక్షల 72 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఏర్పడ్డాక జరుగుతున్న ఐదో అసెంబ్లీ ఎన్నిక ఇది. సీఎం పుష్కర్ ధామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్, పలువురు మంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం హరీశ్ రావత్ పోటీ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ లో తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా 101 సఖి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ బూత్ లలో అందరూ మహిళలే ఉంటారన్నారు ప్రధాన ఎన్నికల అధికారి సౌజన్య. పోలింగ్  ప్రక్రియలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇలా చేశామన్నారు. 


గోవాలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగగా..ఉత్తరాఖండ్ లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియనుంది. 2017 ఎన్నికల్లో ఉత్తరాఖండ్ లో బీజేపీ ఏకంగా 57 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక గోవాలో కాంగ్రెస్ కు 17 , బీజేపీకి 13 సీట్లు రాగా.. చిన్న పార్టీలు, స్వతంత్రులతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని 55 స్థానాలకు రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశ ఎన్నికలు జరిగే 9 జిల్లాల్లో ముస్లిం ప్రాబల్య అసెంబ్లీలే ఎక్కవగా ఉన్నాయి. సహారన్ పుర్ , రాంపుర్  తదితర జిల్లాల్లో ముస్లింల జనాభా చాలా ఎక్కువ. సాధారణంగా ఇక్కడ సమాజ్ వాదీ పార్టీకి గట్టి పట్టుంది. ముస్లింలతో పాటు చెరకు రైతుల ఓట్లు కీలకం కానున్నాయి. రాంపూర్ పోలింగ్ కేంద్రంలో కేంద్రమంత్రి అబ్బాస్ నఖ్వీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎన్నికల బరిలో పలువురు మంత్రులు ఉన్నారు. యూపీ ఆర్థిక మంత్రి సురేశ్ ఖన్నా షాజహాన్ పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి ఏకంగా 8 సార్లు నెగ్గారు. ఎన్నికల తేదీ ప్రకటించాక.... బీజేపీ నుంచి ఎస్పీలోకి వెళ్లిన మాజీ మంత్రి ధరంసింగ్ సైనీ.. నకుద్ నుంచి పోటీ చేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి సీనియర్ నేత మహ్మద్ అజాంఖాన్ రాంపూర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఆయన జైలు నుంచే ఎన్నికల బరిలో దిగారు. అజాంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఖాన్ కూడా స్వర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. రాంపూర్ నవాబుల వారసుడు హైదర్ అలీఖాన్ బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు.

మొత్తం 12 వేల 532 పోలింగ్ బూత్ ల్లో 4 వేల 917 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు ఎన్నికల అధికారులు. 60 వేల మంది పోలీసులు సిబ్బంది, పారామిలటరీ దళాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మహిళా సిబ్బందితో పనిచేసే.. పింక్ బూత్స్ ని ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 55 స్థానాల్లో భాజపా 38 గెలుచుకుంది. సమాజ్వాదీ 15 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ రెండు స్థానాలకు పరిమితమైంది. సమాజ్ వాదీ గెలుపొందిన 15 స్థానాల్లో 10 మంది ముస్లింలే ఉన్నారు.