- ఖాళీ చేస్తే రెండేండ్ల పాటు తాగు, సాగు నీటి కష్టాలు
- ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 1.60 లక్షల ఎకరాలకు క్రాప్ హాలీడే
- హైదరాబాద్‌కు తప్పని తాగునీటి సమస్య
- ఖాళీ చేయకుంటే ప్రాజెక్ట్ దెబ్బతినే ప్రమాదం
- ఇయ్యాల హైదరాబాద్‌లో టెక్నికల్ కమిటీ మీటింగ్
సంగారెడ్డి, వెలుగు : ప్రమాదకరస్థితిలో ఉన్న సింగూరు ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులపై సందిగ్ధం నెలకొంది. పనులు చేపట్టాలంటే ప్రాజెక్ట్‌లోని నీటిని పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రెండేండ్ల పాటు తాగు, సాగు నీటి ఇబ్బందులు తలెత్తుతాయి.. చేయకపోతే ప్రాజెక్ట్ మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈక్రమంలో సింగూరు ప్రాజెక్ట్ విషయాన్ని తేల్చేందుకు బుధవారం హైదరాబాద్‌లో టెక్నికల్ కమిటీ సమావేశం కానుంది. ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దెబ్బతిన్న ఎడమవైపు కట్ట రివిట్‌మెంట్
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ వద్ద 1976లో ప్రాజెక్ట్ పనులను ప్రారంభించి 1980లో పూర్తి చేశారు. 29.917 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 16.102 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్ట్ ఎడమ వైపున ఎనిమిది కిలోమీటర్ల పొడవున ఉన్న కట్టపై దాదాపు 600 మీటర్ల రివిట్‌మెంట్ డ్యామేజీ అయింది. ఇరిగేషన్ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా డ్యామేజీ మరికాస్త పెరిగింది. ఈ విషయాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ ప్రాజెక్ట్ భద్రతా మండలి ఆఫీసర్లు గుర్తించారు.
ప్రాజెక్టులోని నీటిని వెంటనే తీసివేసి కట్టకు రిపేర్లు చేయాలని, లేకపోతే కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రాజెక్ట్ భద్రతపై నీటిపారుల శాఖ సైతం ఇటీవల ముందస్తు జాగ్రత్తలు సూచించింది. ప్రాజెక్ట్‌కు రిపేర్లు చేయకపోతే కట్ట తెగి అనేక గ్రామాలు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఆ శాఖ ఈఎన్‌సీ (జనరల్) నేతృత్వంలో నాలుగు రోజుల కింద టెక్నికల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రత్యామ్నాయ వనరులపై అధ్యయనం చేసి వారం రోజుల్లోగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
కమిటీ తీర్మానం మేరకే సింగూరు ప్రాజెక్ట్ పరిస్థితిపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. రిజర్వాయర్‌ను పూర్తిగా ఖాళీ చేస్తే గానీ రిపేర్లు చేయలేని పరిస్థితి నెలకొంది. కానీ రిజర్వాయర్‌ను ఖాళీ చేస్తే ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు రెండేండ్ల పాటు తాగు, సాగు నీరు నిలిచిపోనుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై కమిటీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాగా, డ్యామ్‌కు రక్షణగా ఉన్న రాతి కట్టడాలు దెబ్బతినడంతో రిపేర్ల కోసం ఇప్పటికే రూ.16.08 కోట్లను ప్రభుత్వం మంజూరు
చేసింది.
1.60 లక్షల ఎకరాలకు క్రాప్ హాలిడే ?
సింగూరు రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 80 వేల ఎకరాలు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మరో 80 వేల ఎకరాల భూములకు సాగునీరు అందుతోంది. సింగూరు ప్రాజెక్టుకు దిగువ భాగంలో ఉన్న మంజీరా బ్యారేజీ, మెదక్ జిల్లా వనదుర్గ (ఘనపురం) ఆనకట్ట, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా నిజామాబాద్ జిల్లాలోని భూములు సాగవుతున్నాయి.
ఇప్పుడు రిపేర్ల కోసం రిజర్వాయర్‌ను ఖాళీ చేస్తే సుమారు రెండేండ్ల పాటు వ్యవసాయానికి నీరు అందని పరిస్థితి నెలకొంటుంది. దీంతో ఆయా జిల్లాల పరిధిలోని మొత్తం 1.60 లక్షల ఎకరాల్లో క్రాప్ హాలీడే ప్రకటించాల్సి ఉంటుంది.
హెచ్ఎండబ్ల్యూఎస్ అభ్యంతరం
సింగూరు ప్రాజెక్ట్‌ను ఖాళీ చేయడంపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా ఆగిపోతే... హైదరాబాద్‌లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు కనీసం 20 నెలల టైం పడుతుందని అభిప్రాయపడింది. మల్లన్న సాగర్ నుంచి వచ్చే నీటి సరఫరా పథకం పనులు పూర్తయ్యాక సింగూరును ఖాళీ చేయాలని సూచిస్తోంది. ఈ పథకం పూర్తయ్యేందుకు కనీసం రెండేండ్ల టైం పడుతుందని హెచ్ఎండబ్ల్యూఎస్ చెబుతోంది. అయితే సింగూరు ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్‌కు 6.96 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి.
సింగూరు ఖాళీ అయితే ఇంత పెద్ద మొత్తంలో నీటిని ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నిస్తోంది. మరో పక్క 5.7 టీఎంసీల కేటాయింపులు ఉన్న మిషన్ భగీరథ ఇంజినీరింగ్ ఆఫీసర్లు కూడా సింగూరును ఖాళీ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బుధవారం హైదరాబాద్‌లో జరగనున్న టెక్నికల్ కమిటీ మీటింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది.
హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా బంద్ ?
సింగూరు ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరితే హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, మిషన్ భగీరథ ఆధ్వర్యంలో సింగూరు నుంచి ప్రతి రోజు 120 మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు.
ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరిక నేపథ్యంలో సింగూరు ప్రాజెక్ట్‌ను ఖాళీ చేస్తే ఇటు హైదరాబాద్‌తో పాటు అటు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో సైతం తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య ఏర్పడనుంది.
