- డిసెంబర్‌లో రిపేర్ పనులు స్టార్ట్
- తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూస్తాం
- ఈఎన్‌సీ ఆఫీసర్ల టీమ్ ప్రకటన
సంగారెడ్డి, వెలుగు: సింగూర్ ఆనకట్ట రిపేర్ పనులు చేయాలంటే నీళ్లు తొలగించాల్సిందేనని.. కాకపోతే రిజర్వాయర్‌ను పూర్తిగా ఖాళీ చేయకుండా డ్యామేజ్‌ను బట్టి విడతల వారీగా కొద్దికొద్దిగా తీయాల్సి ఉంటుందని ఈఎన్‌సీ టెక్నికల్ టీమ్ అధికారి, ఇంజినీర్ ఇన్ చీఫ్ జనరల్ అమ్జద్ హుస్సేన్ తెలిపారు. ఆరుగురు సభ్యులతో కూడిన డ్యాం సేప్టీ టెక్నికల్ టీమ్ శనివారం సింగూర్ ప్రాజెక్ట్, మిషన్ భగీరథ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌తో పాటు పెద్దారెడ్డిపేటలోని మరో వాటర్ ప్లాంట్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా అమ్జద్ హుస్సేన్ మాట్లాడుతూ... రిపేర్ పనులు చేసే క్రమంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ప్రాజెక్ట్‌లో నీటిని ఒకేసారి తీయకుండా విడతల వారీగా ఖాళీ చేయిస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా, ప్రమాదం ఉన్నందున 16.5 టీఎంసీలకు మించకుండా నీటిని నిల్వ ఉంచుతున్నారన్నారు.
వచ్చే నెలలో పనులను ప్రారంభించే ముందు విడతల వారీగా 518 మీటర్ల మట్టం వరకు నీటిని బయటకు విడుదల చేస్తామన్నారు. 800 మీటర్ల రివిట్‌మెంట్ డ్యామేజీ అయినందున నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు చేయాల్సి ఉందన్నారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.19 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.
తాగునీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్ట్‌లో 9 టీఎంసీల నీటిని యథావిధిగా ఉంచనున్నట్టు వెల్లడించారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేస్తున్నామని హుస్సేన్ తెలిపారు. వారి వెంట ఈఎన్‌సీ టెక్నికల్ టీమ్ మెంబర్స్ కృపాకర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సుదర్శన్, బ్రిజేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
