మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ విమెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్‌కు షాక్ తగిలింది. తను ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆరో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా) 6-–3, 6–-4తో తన తోటి ప్లేయర్ కీస్‌ను ఓడించి క్వార్టర్స్ చేరింది. రెండో సీడ్ ఇగాస్వైటెక్ (పోలాండ్)6–0, 6–3తో మాడిసన్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా)ను చిత్తు చేయగా.. నాలుగో సీడ్ అనిసిమోవా (అమెరికా) 7–6 (7/4), 6–4తో వాంగ్ జిన్యు (చైనా)ను, ఐదో సీడ్ రిబకినా (కజకిస్తాన్) 6–1, 6–3తో ఎలీస్ మెర్టెన్స్ (బెల్జియా)ను ఓడించి ముందంజ వేశారు. మెన్స్‌లో వరల్డ్ నంబర్ వన్ సినర్ క్వార్టర్స్ చేరాడు.
నాలుగో రౌండ్‌లో 6-–1, 6–-3, 7–-6 (7/-2) తో తన దేశానికే చెందిన లుసియానో డార్డెరీని ఓడించి వరుసగా తొమ్మిదోసారి గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. ఎనిమిదో సీడ్ షెల్టన్ (అమెరికా) 3–6, 6–4, 6–3, 6–4తో 12వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)పై, ముసెట్టి 6-–2, 7–-5, 6–-4 తేడాతో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై నెగ్గారు. ఇక మెన్స్ డబుల్స్ మూడో రౌండ్‌లో యూకీ బాంబ్రీ (ఇండియా)– ఆండ్రీ గోరాన్సన్ (స్వీడన్) 6–-7(7), 3–-6 తేడాతో బ్రెజిల్‌కు చెందిన ఓర్లాండో లూజ్ - రఫెల్ మాటోస్ జంట చేతిలో పరాజయం పాలయ్యారు.
