
లండన్: ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న ఇటలీ స్టార్ యానిక్ సినర్.. కెరీర్‌లో తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సినర్ 4–6, 6–4, 6–4, 6–4తో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)పై గెలిచాడు. ఫలితంగా ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. సినర్ వరసగా ఆడిన నాలుగో ఫైనల్ వింబుల్డన్ కావడం విశేషం. ఫ్రెంచ్‌లో ఓడిన సినర్ యూఎస్, ఆస్ట్రేలియా, వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో అల్కరాజ్ తనను ఓడించడానికి ఐదున్నర గంటలు తీసుకుంటే ఈ మ్యాచ్‌లో సినర్ 3 గంటల 9 నిమిషాల్లోనే చెక్ పెట్టాడు. ఇక 2023, 2024లో వరుసగా టైటిల్స్ నెగ్గిన అల్కరాజ్ ఈసారి మాత్రం తన ట్రేడ్ మార్క్ ఆటను రిపీట్ చేయలేకపోయాడు. ఒత్తిడిని జయించలేకపోవడంతో తన వరుస 24 విజయాలకు చెక్ పడింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌లో రెండుసార్లు సినర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అల్కరాజ్ తర్వాతి మూడు సెట్లలో తడబడ్డాడు. తన హైట్‌ను ఉపయోగించుకుని సినర్ కొట్టిన బలమైన సర్వీస్‌లను ఎదుర్కోలేక ఇబ్బందిపడ్డాడు.
ఫలితంగా వరుసగా రెండు సెట్లను చేజార్చుకున్నాడు. కీలకమైన నాలుగో సెట్‌లో అల్కరాజ్ పుంజుకునే ప్రయత్నం చేసినా సినర్ ఏమాత్రం చాన్స్ ఇవ్వలేదు. స్కోరు 3–1 ఉన్న దశలో ఇద్దరూ సర్వీస్‌లు నిలబెట్టుకున్నారు. ఫలితంగా సినర్ 5–4తో ముందంజలో నిలిచాడు. కీలకమైన పదో గేమ్‌లో స్కోరు 40–0 వద్ద సినర్ క్రాస్ కోర్టు షాట్స్‌తో అల్కరాజ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. దాంతో అప్పటికే మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకున్న అల్కరాజ్ రెండుసార్లు నెట్‌కు కొట్టి నిరాశకు లోనయ్యాడు.
ఓవరాల్ అటాకింగ్ గేమ్‌తో చెలరేగిన సినర్ 8 ఏస్‌లు, రెండు డబుల్ ఫాల్ట్స్ చేశాడు. తన సర్వీస్‌లో 72 శాతం పాయింట్లతో ముందంజ వేశాడు. 9 బ్రేక్ పాయింట్లలో నాలుగింటిని కాచుకున్నాడు. 40 విన్నర్లు, 40 అనవసర తప్పిదాలు చేశాడు. ఇక 15 ఏస్‌లు, 7 డబుల్ ఫాల్ట్స్ చేసిన అల్కరాజ్ తన సర్వ్‌లో 64 శాతం పాయింట్లకే పరిమితమయ్యాడు. 6 బ్రేక్ పాయింట్లలో రెండింటిని సద్వినియోగం చేసుకున్నాడు. 36 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేసిన కార్లోస్ 38 విన్నర్లకే పరిమితమయ్యాడు. మొత్తానికి సినర్ తన గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్‌ను నాలుగుకు పెంచుకున్నాడు.
మెర్టెన్స్–కుదెర్మెటోవవా జోడీకి డబుల్స్ టైటిల్
విమెన్స్ డబుల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ వెరోనికా కుదెర్మెటోవా–ఎలీస్ మెర్టెన్స్ (బెల్జియం) 3–6, 6–2, 6–4తో హీస్ సు వీ (తైపీ)–జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచారు. కుదెర్మెటోవాకు ఇది తొలి గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ కాగా, మెర్టెన్స్‌కు ఐదోది. వింబుల్డన్ రెండోది.
ప్రైజ్‌మనీ
సినర్: రూ. 34.82 కోట్లు
అల్కరాజ్: రూ. 17.64 కోట్లు