15 ఏండ్లుగా దుబాయ్ ​జైలులో!

V6 Velugu Posted on Jun 10, 2021

 

  •     హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు సిరిసిల్ల వాసులు
  •     తెరపైకి క్షమాభిక్ష దరఖాస్తు
  •     న్యాయ సహాయం అందిస్తే విడుదల సాధ్యం

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. ఉన్న ఊళ్లో ఉపాధి కరువై పొట్ట చేతబట్టుకొని గల్ఫ్​వెళితే.. అక్కడ హత్య కేసులో ఇరుక్కున్నారు. 15 ఏండ్లుగా దుబాయ్​జైలులో  మగ్గుతున్నారు. 2004లో రాజన్నసిరిసిల్ల జిల్లా పెద్దూర్​ గ్రామానికి చెందిన అన్నదమ్ములు శివరాత్రి మల్లేశం, రవి, చందుర్తి మండలానికి చెందిన గోలం నాంపల్లి, శివరాత్రి హన్మండ్లు, కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్​ దుబాయ్​ వెళ్లారు. ఆరు నెలల అనంతరం నేపాల్​కు చెందిన బహుద్దూర్​సింగ్​అనే వాచ్​మెన్​హత్యకు గురయ్యాడు. అక్కడే పని చేస్తున్న జిల్లావాసులు ఐదుగురు ఈ కేసులో ఇరుక్కున్నారు. దుబాయ్​ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దుబాయ్​చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబసభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో క్షమాభిక్ష పత్రాలపై నేపాల్​కు చెందిన హత్యకు గురైన వ్యక్తి కుటుంబసభ్యులతో సంతకాలు చేయించారు. వారికి ఆర్థిక సాయంగా రూ. 15 లక్షలు అందించారు. కానీ అప్పుడే దుబాయ్​ చట్టాల్లో మార్పు వచ్చింది. వీరి క్షమాభిక్ష కొట్టివేసింది. దీంతో 15 ఏళ్లుగా దుబాయ్​ జైలులోనే మగ్గుతున్నారు. తాజా చట్టాల ప్రకారం 15 ఏండ్ల అనంతరం క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 ఫిబ్రవరి 7వ తేదీతో వీరి జైలు జీవితం 15 ఏండ్లు ముగిసింది. ఫిబ్రవరి 9న దుబాయ్​ కోర్టుకు క్షమాభిక్ష పెట్టాలని దరఖాస్తు చేసుకోగా వీరి అభ్యర్థనను స్వీకరించింది. 

జూన్ ​14న కేసు విచారణ

క్షమాభిక్ష  కేసు జూన్​ 14న దుబాయ్​ కోర్టులో మొదటి విడత విచారణకు రానుంది. ఈ కేసును దుబాయ్​కు చెందిన లాయర్​అనురాధ వాదిస్తున్నారు.  ఈలోగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష పెట్టాలని ఓ లెటర్​దుబాయ్​ ప్రభుత్వానికి రాయాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఈ సహకారం అందిస్తే 10 ఏండ్ల జైలు శిక్ష రద్దయి.. విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని బాధితులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమపై దయతో సాయం చేయాలని, దుబాయ్​ ప్రభుత్వానికి లెటర్​రాయాలని వేడుకుంటున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దుబాయ్​లోని స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, ఎంబసీ అధికారులు తమకు న్యాయ సహాయం అందించాలని వేడుకుంటున్నారు.
 

Tagged sircilla, residents, 15 Years, Dubai jail, murdercase

Latest Videos

Subscribe Now

More News