చెరువును పూడ్చి కలెక్టరెట్ నిర్మాణం.. వరదనీటిలో మునక..

చెరువును పూడ్చి కలెక్టరెట్ నిర్మాణం.. వరదనీటిలో మునక..

సమన్వయం లేని శాఖలు నీళ్లల్ల నిర్మాణాలు!

చెరువు శిఖాలు, వాగులు, వంకల్లో కోట్ల విలువైన బిల్డింగులు

కలెక్టరేట్లు మొదలుకొని డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల దాకా ఇదే తీరు

ఇటీవలి వానలకు మునిగిన రైతు వేదికలు, శ్మశానవాటికలు

శాఖల మధ్య సమన్వయలోపమే ప్రధాన కారణం

వెలుగు, నెట్​వర్క్: ​చిన్న ఇల్లు కట్టాలంటేనే ఒకటికి రెండుసార్లు  సోచాయిస్తం.  అలాంటిది నాలుగు కాలాలపాటు ఉండేలా కోట్లు పెట్టి కట్టే బిల్డింగుల విషయంలో ఇంకెన్ని  జాగ్రత్తలు తీసుకోవాలె. కానీ మన సర్కారు కు అదేం పట్టట్లేదు. చెరువు శిఖాలు, వాగులు, వంకల్లో కలెక్టరేట్లు, కాలేజీ బిల్డింగులు, స్టేడియాలు,  రైతువేదికలు, శ్మశానవాటికలు, సబ్​స్టేషన్లు కడుతున్నా పట్టించుకోట్లేదు.  తీరా వానలు పడి చెరువులు నిండాక అవి కాస్తా నీళ్లలో మునుగుతున్నయ్.

మూడు డిపార్ట్​మెంట్ల తప్పులతో నేడు తిప్పలు

ప్రభుత్వం తరఫున ఏవైనా నిర్మాణాలు చేపట్టాలనుకున్నప్పుడు ముందుగా స్థల సేకరణ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖది. రెవెన్యూ ఆఫీసర్లు ఫీల్డ్​విజిట్​చేసి ఆ ల్యాండ్​ నిర్మాణానికి పనికి వస్తుందా లేదా ప్రాథమికంగా అంచనా వేయాలి. దగ్గరలో చెరువు, వాగు ఉంటే అది ఎఫ్ టీఎల్​పరిధిలోకి వస్తుందో, లేదో తెలుసుకునేందుకు ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​తో  కన్ఫర్మ్​ చేసుకోవాలి. అవసరమైతే ఇరిగేషన్​ ఆఫీసర్లను కూడా ఫీల్డ్​ విజిట్​కు తీసుకెళ్లాలి. అంతా ఓకే అనుకున్నాక ఆర్అండ్​బీకో, ఆయా శాఖలకో అప్పగించాలి. ఆ తర్వాత ఆర్అండ్​బీ ఆఫీసర్లు సాయిల్ ​టెస్ట్​ చేసి, అది బిల్డింగ్​ నిర్మాణానికి పనికివస్తుందో లేదో తేల్చాలి.  అటుపైనే ఆయా శాఖల ఆధ్వర్యంలో  నిర్మాణాలు చేపట్టాలి. ఇది ప్రొసీజర్. కానీ చాలాచోట్ల ఈ ప్రొసీజర్​ ఫాలో కావట్లేదు. ముఖ్యంగా స్థల సేకరణ విషయంలో రెవెన్యూ ఆఫీసర్లపై ప్రెషర్​ ఎక్కువగా ఉంటోంది. సరిపడా గవర్నమెంట్​ ల్యాండ్​ అందుబాటులో లేకపోవడంతో చెరువుల వెంట, వాగుల పొంట స్థలం కేటాయించి చేతులు దులుపుకొంటున్నారు. ఇరిగేషన్​ ఆఫీసర్లు కూడా అడ్డు చెప్పకపోవడంతో నిర్మాణాలు పూర్తయ్యాక నీళ్లలో మునుగుతున్నాయి.

రియల్టర్లకు మేలు చేసేలా..

కొన్నిచోట్ల కేవలం రియల్టర్లకు మేలు చేసేందుకు వెంచర్ల దగ్గర్లో గవర్నమెంట్​ బిల్డింగులు కట్టేలా ఆఫీసర్లపై అక్కడి ప్రజాప్రతినిధులు ప్రెషర్​ తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులను ఆనుకొని వెలిసిన అనేక వెంచర్లలో లీడర్లకు ఎంతో కొంత వాటా ఉంటోంది. దీంతో భూముల రేట్లు పెంచుకునేందుకు అక్కడ గవర్నమెంట్ బిల్డింగులు కట్టేలా తెరవెనుక కథ నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఉదాహరణకు  జనగామ జిల్లాకేంద్రంలో  రూ.40 లక్షలతో నిర్మించిన ఆర్టీవో ఆఫీస్​ కొత్త  బిల్డింగ్ నీటమునిగింది. కాంగ్రెస్​ హయాంలో అప్పటి కొందరు ప్రజాప్రతినిధులు తాము చేసిన వెంచర్​కు డిమాండ్​ కోసం ఇక్కడ బిల్డింగ్​ ప్లాన్​ చేస్తే ఆఫీసర్లు గుడ్డిగా పర్మిషన్​ఇచ్చారు. ఈ ల్యాండ్​ కంబాల కుంట ఎఫ్​టీఎల్​ పరిధిలో ఉందని తెలిసినా నిర్లక్ష్యంగా కట్టారు. దీంతో అది పూర్తిగా నీటమునిగింది. మరో కొద్దిరోజులు ఇలాగే ఉంటే బిల్డింగ్​ పరిస్థితి ఏంటన్నది అర్థం కావట్లేదు.

నల్లవాగులో ఎన్ని నిర్మాణాలో..

నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామ శివారులోని నల్లవాగులో ఏకంగా మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించిన శ్మశానవాటికలు, డంపింగ్​ యార్డులు కట్టారు. ఇటీవలి వరదలకు అన్నీ నీట మునిగాయి. ఎస్​పీడీసీఎల్​ఆఫీసర్లు సైతం ఇదే నల్లవాగులో 33/11 కేవీ సబ్​స్టేషన్​ నిర్మాణం ప్రారంభించగా, దాని బెడ్స్ ​కూడా ఇటీవల నీటమునిగాయి.  దీంతో పనులు నిలిపివేశారు.

చెరువును పూడ్చి కలెక్టరేట్​..

ఇటీవలి వర్షాలు, వరదలకు నీటమునిగిన బిల్డింగుల్లో కలెక్టరేట్ ​మొదలుకొని డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్ల దాకా చాలా ఉన్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది సిరిసిల్ల కలెక్టరేట్. పట్టణంలోని బైపాస్​ పక్కనున్న కొచ్చెరువును పూడ్చి దాదాపు 35 ఎకరాల్లో రూ. 100 కోట్లతో  కలెక్టరేట్​కట్టారు. చెరువునైతే పూడ్చారు కానీ వాన పడితే చెరువులోకి వచ్చే నీళ్లను మళ్లించే ఏర్పాట్లు చేయలేదు. దీంతో సిరిసిల్ల టౌన్​లోని డ్రెయిన్​లతోపాటు చంద్రంపేట, చిన్నబోనాల, ముష్టిపల్లి చెరువులు నిండి వచ్చిన వరద నీరంతా కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్​ఆవరణలోకి చేరింది. బిల్డింగ్​లోకి వెళ్లే దారిలేక టెంపరరీగా కాలువ తీసి నీటిని మళ్లించారు. ప్రస్తుతం కలెక్టరేట్​ను కాపాడుకునేందుకు ఆఫీసర్లు పర్మినెంట్​నాలా కట్టే పనుల్లో ఉన్నారు. మొన్నటి వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో డబుల్ బెడ్ రూమ్ కాలనీ నీట మునిగింది. వెంగళరావు సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఈ ల్యాండ్​ డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లకు పనికిరాదని మొదటి నుంచీ ప్రతిపక్ష పార్టీలు మొత్తుకున్నా రెవెన్యూ ఆఫీసర్లు వినలేదు. ఫలితంగా అంతంతే క్వాలిటీగా ఉన్న ఇండ్ల పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందోననే భయం లబ్ధిదారులను వెంటాడుతోంది. ఇక ఇటీవల పంచాయతీరాజ్​శాఖ నిర్మించిన వైకుంఠధామాలు, రైతువేదికలు, కేవీ సబ్​స్టేషన్లు సైతం చాలా ఏరియాల్లో నీటమునిగాయి.

మెదక్ గర్ల్స్ జూనియర్ కాలేజీ


మెదక్ లో గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీ బిల్డింగ్ ను చెరువు శిఖంలో కట్టారు. ఆర్ ఐడీఎఫ్ కింద శాంక్షన్ అయిన రూ. 2.50 కోట్లతో కట్టిన ఈ బిల్డింగ్ ను 2019లో మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. 500 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్న ఈ కాలేజీ వాన పడితే చాలు నీళ్లలో మునిగిపోతుంది. మెదక్ పట్టణంలో నర్సిఖేడ్ దారిలో ఏదుల చెరువు శిఖం భూమి ఖాళీగా ఉంటే కబ్జా అవుతుందని కాలేజీ కట్టేందుకు కేటాయించినట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ మధ్య పడ్డ వానలకు కాలేజీకి మూడు దిక్కులా నీళ్లు చేరాయి. నీళ్లు చేరడంవల్ల గోడలకు తేమ వచ్చి బిల్డింగ్ దెబ్బతింటుందని ఎక్స్ పర్స్ట్ అంటున్నారు. కాలేజీ వరకు టెంపరరీగా
వేసిన మొరం రోడ్డు బురదగా తయారైంది.

నీటి కుంటలో అవుట్ డోర్ స్టేడియం
ఈ ఫోటోలో కనిపిస్తున్నది చెరువు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరపడినట్లే. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దేవరకొండ పట్టణంలోని అవుట్ డోర్ స్టేడియం ఇలా చిన్నపాటి చెరువును తలపిస్తోంది. సుమారు ఐదు ఎకరాల్లో రూ.2.65 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టేడియం ఇలా మారడానికి కారణం అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకున్న తప్పుడు నిర్ణయమే. వాస్తవానికి స్టేడియం నిర్మిస్తున్న ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద నీటి కుంట ఉండేది. ఈ కుంట కిందనే వందల ఎకరాల భూములు సాగులోకి వచ్చేవి. అయితే దేవరకొండలో స్టేడియం నిర్మాణానికి జాగ లేదని నీటి కుంటను రాళ్లు, రప్పలతో పూడ్చేశారు. ఇటీవలి భారీ వర్షాలకు స్టేడియం నిజస్వరూపం బట్టబయలైంది.

For More News..

ఫ్రెండ్స్​తో కలిసి చెల్లిని గ్యాంగ్​రేప్​ చేసిన అన్న

బండి సంజయ్​ గొంతుపట్టి కారులోకి తోసేసిన పోలీసులు