సిసోడియాను చంపటానికి కుట్ర

సిసోడియాను చంపటానికి కుట్ర

తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆప్ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియాను చంపటానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. ఆయన ఆందోళన వ్యక్తం చేయటం కలకలం రేపుతోంది. తొలిసారి అరెస్ట్ చేసిన ఖైదీని.. వీవీఐపీని.. ఉగ్రవాదులను ఉంచే సెల్ లో ఉంచారని.. అక్కడ ఉన్న ఖైదీల్లో చాలా మందికి మానసిక స్థితి సరిగా లేదని.. వాళ్లు ఏమైనా చేయొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ సంజయ్ సింగ్. సిసోడియాను చూసి బీజేపీ ఎందుకు భయపడుతుందో తెలియటం లేదంటూ విమర్శలు చేశారాయన. 

ఇదే విషయంలో మరో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సైతం స్పందించారు. ఆయన్ను ధ్యానం చేసుకునే సెల్ లో ఉంచాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని.. అందుకు భిన్నంగా జైలు అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారాయన. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిసోడియా హత్యకు కుట్రలు చేస్తుందని.. అయినా ఢిల్లీ ప్రజలు మా వెంటే ఉన్నారని.. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మా పార్టీకే దక్కాయనే కోపంతో వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు భరద్వాజ్.

ఆప్ నేతల ఆరోపణలపై రెండు రోజుల క్రితమే జైలు అధికారులు స్పందించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. రిమాండ్ ఖైదీగా లభించే అన్ని ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. సీనియర్ సిటిజన్లు ఉండే సెల్ లోనే ఆయన్ను ఉంచామని.. ఈ విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని స్పష్టం చేశారు జైలు అధికారులు. అయితే అధికారుల మాటలను ఆప్ నాయకులు నమ్మటం లేదు.. ఆయన్ను తీవ్రవాదులు ఉండే సెల్ నెంబర్ వన్ లో ఉంచారని అంటోంది.