
- అమెరికాలో ఉండగానే హైదరాబాద్‌లోని సెల్‌ఫోన్ ఫార్మాట్ చేయించాడు
- విచారణకు హాజరవుతూనే జూన్ 10, జులై 15న
- సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ డేటా డిలీట్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును మరోసారి విచారించేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభాకర్ రావు తమ దర్యాప్తుకు సహకరించడం లేదని కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావును మరోమారు విచారించేందుకు సిట్ అధికారులు చర్యలు చేపట్టారు.
త్వరలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు తెలిసింది. ప్రధానంగా ప్రభాకర్ రావు వినియోగించిన మూడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఫార్మాట్ చేయడానికి గల కారణాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సేకరించిన ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టుల ఆధారంగా ప్రభాకర్ రావు నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది.
అమెరికాలో ఉండి.. ఇక్కడ ఆధారాల మాయం
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) లాగర్ రూమ్ ధ్వంసం కేసుతో ఫోన్‌ట్యాపింగ్ గుట్టు బయటపడిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి 10న పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన తరువాత ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయాడు. ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు వినియోగించిన ఒక సెల్‌ఫోన్ ఈ ఏడాది ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో ఫార్మాట్ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులో వెల్లడైంది.
ఆ సమయంలో ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నారు. కాగా ఇక్కడ సెల్‌ఫోన్ ఎవరుఫార్మాట్ చేశారనే కోణంలో సిట్ దర్యాప్తు చేస్తున్నది. కేసు నమోదైన తరువాత అమెరికాకు వెళ్లిన ప్రభాకర్ రావు.. అక్కడి నుంచే ఆధారాలు మాయం చేసేందుకు పథకం రచించినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.
ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టుల ఆధారంగా..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 8న ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యాడు. అరెస్ట్ చేయకుండా విచారించాలనే సుప్రీం ఆదేశాల మేరకు ఆయను సిట్ అధికారులు ఇప్పటికే 10 సార్లు విచారించారు. సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. ఈ క్రమంలోనే మే 29న సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ మేరకు సిట్ విచారణకు హాజరవుతూనే ఆధారాలను మాయం చేసేందుకు యత్నించినట్లు సిట్ గుర్తించింది. ఇందులో ఆయన అధికారికంగా వినియోగించిన సెల్‌ఫోన్‌ను జూన్ 10న, ల్యాప్‌టాప్‌ను జులై 15న ఫార్మాట్ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ ఆధారంగా గుర్తించింది. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.