
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నలుగురు నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకుంది. చంచల్ గూడ జైలు నుంచి నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ , డాక్యా నాయక్, రాజేశ్వర్ లను సిట్ ఆఫీస్ కు తరలించి విచారిస్తున్నారు. మార్చి 28 వరకు నిందితులు సిట్ కస్టడీలో ఉండనున్నారు. ఇప్పటికే వీరిని ఆరు రోజుల పాటు విచారించింది సిట్. ఇదే కేసులో నిందితులైన షమీమ్ ,రమేశ్, సురేష్ ల కస్టడీ పిటిషన్ ను మార్చి 27కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు.
ఈ కేసులో గతంలో నోటీసులు అందుకున్న ప్రజాప్రతినిధులను విచారిస్తోంది సిట్. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని విచారించిన సిట్ .. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి రెండు సార్లు నోటీసులిచ్చింది. అయితే బండి సంజయ్ కు బదులుగా వివరణ ఇచ్చేందుకు ఆయన లీగల్ టీం సిట్ విచారణకు హాజరయ్యింది.
గ్రూప్ 1లో అర్హత సాధించిన మరికొంత మంది అభ్యర్థులను కూడా సిట్ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే కొంతమంది అర్హత సాధించిన వారి వివరాలు సేకరించి ఫోన్ లో విచారించింది. 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులకు నోటీసులిచ్చి వారి నుంచి వివరణ తీసుకుంటుంది.