పేలుళ్లకు ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు. ?

పేలుళ్లకు ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు. ?

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో పేలుళ్లకు కుట్ర కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రనేడ్ దాడులు ఎప్పుడు, ఎక్కడ చేద్దామనుకున్నారనే వివరాలు రాబడుతున్నారు. ఐసిస్‌‌ టార్గెట్‌‌లో ఉన్న ఆర్‌‌‌‌ఎస్ఎస్‌‌, బీజేపీ నేతలు ఎవరు, విధ్వంసాలకు సెలెక్ట్‌‌ చేసుకున్న ప్రాంతాలు ఏవీ అనే సమాచారం సేకరిస్తున్నారు. స్పెషల్‌‌ ఇన్వెస్టిగేషన్‌‌ టీమ్‌‌ (సిట్) ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం మరో ఏడుగురిని అదుపులోకి తీసున్నారు. ఆదివారం అరెస్ట్ చేసిన జాహెద్‌‌, సమీయుద్దీన్‌‌, మాజ్ హసన్‌‌లకు సోమవారం గాంధీ హాస్పిటల్‌‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత నాంపల్లి కోర్టు జడ్జి ఇంట్లో ప్రవేశపెట్టారు. జడ్జి 14 రోజుల జ్యుడీషియల్‌‌ రిమాండ్‌‌ విధించడంతో చంచల్‌‌గూడ జైలుకు తరలించారు.

నేపాల్ మీదుగా గ్రనేడ్ల సప్లయ్

ఆయుధాలు, పాకిస్తాన్‌‌ ఫండింగ్‌‌, రిక్రూట్‌‌మెంట్‌‌పైనే పోలీసులు ఫోకస్‌‌ పెట్టారు. పాకిస్తాన్‌‌ నుంచి నేపాల్‌‌ మీదుగా గ్రనేడ్లను సప్లయ్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. 20 ఏండ్లుగా జాహెద్‌‌ ఏం చేస్తున్నాడనే వివరాలను ఆరా తీశారు. అతడి కుటుంబ సభ్యుల వివరాలతో స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్ చేశారు. జాహెద్‌‌ పేరుతో మూడు అకౌంట్స్‌‌ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. రిక్రూట్‌‌మెంట్‌‌ కోసం ఆయా అకౌంట్స్‌‌లో భారీ మొత్తంలో డిపాజిట్లు జరిగినట్లు సమాచారం. గత మూడు నెలల్లో భారీగా రిక్రూట్‌‌మెంట్‌‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల సెల్‌‌ఫోన్ డేటా ఆధారంగా అనుమానితుల లిస్ట్ సిద్ధం చేస్తున్నారు. సోషల్‌‌ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌లోనే ఎక్కువ సంఖ్యలో రిక్రూట్‌‌మెంట్‌‌ జరిగినట్లు గుర్తించారు. వివిధ రకాల కోడ్స్‌‌తో వాట్సాప్ గ్రూప్స్‌‌ ఉన్నట్లు తెలిసింది. ఇన్‌‌స్టాగ్రామ్‌‌లోనూ ఎక్కువ మంది యువకులతో కాంటాక్ట్‌‌ అయ్యారని సమాచారం. ఫర్హతుల్లా ఘోరి ప్లాన్ ఆఫ్ యాక్షన్‌‌తో ఎక్స్‌‌ప్లోజివ్స్‌‌ తయారీకి కావాల్సిన మెటీరియల్‌‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. గ్రనేడ్లతోనే విధ్వంసాలు సృష్టించాలని ఫర్హతుల్లా ఆదేశించాడని తెలిసింది. నిందితులను కస్టడీలోకి తీసుకుని పూర్తి వివరాలు రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం కస్టడీ పిటిషన్ ఫైల్‌‌ చేసేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జాహెద్ ఇచ్చిన సమాచారంతో..

హైదరాబాద్‌‌లో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర చేశారనే సమాచారంతో మూసారాంబాగ్‌‌కి చెందిన జాహెద్‌‌, సైదాబాద్‌‌కి చెందిన సమీయుద్దీన్‌‌, మెహిదీపట్నానికి చెందిన మాజ్‌‌ హసన్‌‌ను ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరి వద్ద నాలుగు హ్యాండ్ గ్రనేడ్లు, రూ.5.41 లక్షల నగదు, సెల్‌‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల సెల్‌‌ఫోన్స్ ఆధారంగా ఐఎస్​ నెట్‌‌వర్క్‌‌ను ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వారంలోనే గ్రనేడ్‌‌ దాడులకు ప్లాన్‌‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నెల రోజులుగా పేలుళ్లకు రెక్కీ చేస్తున్నారని గుర్తించినట్లు తెలిసింది. జాహెద్‌‌ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌‌లోని ఐసిస్‌‌ సానుభూతిపరుల వివరాలు సేకరిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ఆదిల్‌‌ అఫ్రోజ్‌‌, అబ్దుల్‌‌ హయ్, సొహైల్ ఖురేషీ, అబ్దుల్ ఖలీమ్‌‌ అలియాస్ హడ్డీలతో పాటు మరో ముగ్గురిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని విడివిడిగా ప్రశ్నించి స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేశారు. పబ్లిక్ ప్లేసుల్లో బాంబు బ్లాస్టులు.. ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌, బీజేపీ సభల్లో గ్రనేడ్ దాడులు చేసేందుకు రెక్కీ చేసినట్లు ఆధారాలు సేకరించారు. పాకిస్తాన్‌‌లో షెల్టర్‌‌‌‌ తీసుకుంటున్న ఫర్హతుల్లా ఘోరీ ఆదేశాలకు అనుగుణంగా వరుస పేలుళ్లకు కార్యాచరణ రూపొందించినట్లు సిట్‌‌ అధికారులు గుర్తించారు.