- ఫోన్ ట్యాపింగ్ కేసులోకన్ఫ్రంటేషన్కు ఏర్పాట్లు
- గతంలో నిందితులిచ్చిన స్టేట్‌మెంట్ల నుంచే ప్రశ్నలు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా ఏర్పడిన సిట్ దర్యాప్తు ప్రారంభించింది. సీపీ సజ్జనార్ సహా 10 మంది సభ్యులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అసలు సూత్రదారుల గుట్టు విప్పేందుకు పక్కా ఆధారాలు సేకరిస్తోంది. ప్రభాకర్ రావు, ప్రణీత్‌రావులను కన్‌ఫ్రంటేషన్ (ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించడం) కు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభాకర్ రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చేవి.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్‌రావుకు ప్రభాకర్‌రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాడనే వివరాలను సిట్ సేకరించబోతోంది.
కాగా, ప్రభాకర్ రావును ఇప్పటి వరకు 12 సార్లకు పైగా విచారించినప్పటికీ స్పెషల్ టీమ్ సరైన సమాధానాలు రాబట్టలేకపోయింది. ఈ మేరకు ప్రభాకర్‌రావు నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు సిట్ ప్రణాళికలు రూపొందించింది. ప్రణీత్‌రావు సహా, మిగితా నలుగురు మాజీ పోలీస్ అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా క్రాస్ క్వశ్చనింగ్ చేయనున్నట్లు తెలిసింది.
బీఆర్‌ఎస్ కోసమే ‘స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు శనివారం సిట్ ఎదుట హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ ఆఫీసులో సిట్ సభ్యుడి హోదాలో ఏసీపీ వెంకటగిరి ఆయన్ను ప్రశ్నించారు. సిట్ ఆఫీసును జూబ్లీహిల్స్ పీఎస్ నుంచి బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ బిల్డింగ్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి అక్కడే సిట్ విచారణ జరుగనున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఎస్‌ఐబీ కేంద్రంగా ‘స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్’ ఏర్పాటు చేయడం వెనుక గల కుట్రను ప్రభాకర్ రావు చేతనే చెప్పించేందుకు ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఈ మేరకు రాధాకిషన్ రావు, ప్రణీత్‌రావుల స్టేట్‌మెంట్ల ఆధారంగా ప్రశ్నావళి సిద్ధం చేసినట్లు తెలిసింది. ముగ్గురు
ఐపీఎస్‌లతో మూడు టీమ్‌లు..
సాంకేతిక ఆధారాల సేకరణ, ప్రభాకర్ సహా ప్రణీత్‌రావు, రాధాకిషన్ రావులను విచారించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు గాను సిట్ సభ్యులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు అంబర్ కిషోర్ ఝా, ఎస్‌ఎమ్ విజయ్‌కుమార్, రితిరాజ్‌తో మూడు బృందాలు ఏర్పాటు చేశారు. కేసు నమోదైన నాటి నుంచి రికార్డ్ చేసిన నిందితుల వాంగ్మూలాలు, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులు, కాల్‌డేటా సహా ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు సంబంధించి ఈ మూడు బృందాలు పనిచేయనున్నాయి.
