రోహిత్‌‌ రెడ్డి డ్రగ్స్ కాంటాక్టుల చుట్టే సిట్‌‌ ఎంక్వయిరీ

రోహిత్‌‌ రెడ్డి డ్రగ్స్ కాంటాక్టుల చుట్టే సిట్‌‌ ఎంక్వయిరీ
  •     కాల్‌‌ డేటా, వాట్సాప్  చాటింగ్‌‌, పేమెంట్‌‌ డీటెయిల్స్‌‌తో ప్రశ్నలు
  •     రోహిత్‌‌, రితేష్‌‌ చెప్తేనే కాల్పులు : నమితి శర్మ
  •     ఆ ముగ్గురినీ కస్టడీకి తీసుకున్న సిట్‌‌
  •     ఫామ్‌‌హౌస్‌‌లో డ్రగ్స్‌‌ పార్టీలు, కాల్పులపై ఆరా

హైదరాబాద్‌‌,వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్  మాజీ ఎమ్మెల్యే పైలెట్‌‌ రోహిత్ రెడ్డి ఫామ్‌‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీలో వినియోగించిన డ్రగ్స్‌‌తో పాటు రోహిత్‌‌ రెడ్డికి డ్రగ్స్ పెడ్లర్లతో ఉన్న కాంటాక్ట్స్‌‌పై సిట్‌‌  వివరాలు సేకరించింది. సిట్‌‌ విచారణలో కొన్ని ప్రశ్నలకు రోహిత్ రెడ్డి సమాధాలు దాటవేసే ప్రయత్నం చేయడంతో.. పెడ్లర్లలో మాట్లాడిన కాల్‌‌ డేటా, వాట్సాప్‌‌ చాటింగ్స్, పేమెంట్స్‌‌కు సంబంధించిన ఆధారాలను ముందుంచి సిట్  ప్రశ్నించింది. దీంతో రోహిత్‌‌ రెడ్డి నోరువిప్పక తప్పలేదు. ఈ క్రమంలోనే ఫామ్‌‌హౌస్  కేంద్రంగా జరిగిన వీకెండ్ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్‌‌ వినియోగించినట్లు సిట్‌‌  ఆధారాలు సేకరించింది.

ఫామ్‌‌హౌస్‌‌లో డ్రగ్స్, కాల్పుల కేసులో నమిత్‌‌  శర్మ, రోహిత్‌‌ రెడ్డి, రితేశ్ రెడ్డిని 72 గంటల పాటు సిట్‌‌  కస్టడీకి అప్పగిస్తూ సోమవారం ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఉదయం 6 గంటలకు ఈ ముగ్గురు నిందితులను సిట్‌‌తన కస్టడీలోకి తీసుకుంది. చంచల్‌‌గూడ జైలు నుంచి శంషాబాద్  రూరల్  పోలీస్‌‌స్టేషన్‌‌కు తరలించి విచారించారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్‌‌‌‌ సుధీర్‌‌‌‌బాబు నేతృత్వంలో చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్‌‌తో కూడిన సిట్ బృందం ఈ ముగ్గురినీ విడివిడిగా విచారించింది.

ఫామ్‌‌హౌస్‌‌లో వీకెండ్‌‌ డ్రగ్స్‌‌ పార్టీలపై సిట్‌‌ నజర్

మొదటి రోజు కస్టడీలో భాగంగా ముగ్గురి వ్యక్తిగత వివరాలతో పాటు వ్యాపార లావాదేవీలు, ఫామ్‌‌హౌస్‌‌లో వీకెండ్‌‌ పార్టీ గురించి ఆరా తీసింది. ప్రధానంగా ఫామ్‌‌హౌస్‌‌లో జరిగిన డ్రగ్స్‌‌ పార్టీలపైనే సిట్ ఫోకస్  పెట్టినట్లు తెలిసింది. ఇందులో భాగంగా డ్రగ్స్‌‌ పార్టీల గురించి రోహిత్‌‌రెడ్డిని ప్రశ్నించగా.. సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దీంతో రోహిత్‌‌ రెడ్డితో కాంటాక్ట్‌‌  పెడ్లర్ల ఫోన్ నంబర్లను అతని ముందుంచి విచారించింది. ఆయా ఫోన్‌‌ నంబర్లు ఎవరివో తెలుసా అని ప్రశ్నించింది. 

తనకు తెలియదని రోహిత్ రెడ్డి చెప్పడంతో వారితో కాంటాక్ట్స్‌‌ ఆధారాలను చూపినట్లు తెలిసింది. డ్రగ్స్‌‌ వ్యవహారంపై ఈ ముగ్గురిని విడివిడిగా ప్రశ్నించిన తర్వాత మళ్లీ ముగ్గురిని కలిపి విచారించారు. కేసు దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో పాటు రోహిత్ రెడ్డి పీఏ శ్రవణ్‌‌కుమార్‌‌‌‌, డ్రైవర్‌‌‌‌ శరత్‌‌కుమార్‌‌‌‌ సహా పార్టీలో పాల్గొన్న నిందితులు ఇచ్చిన స్టేట్‌‌మెంట్ల ఆధారంగా ముగ్గురిని సిట్‌‌ బృందం ప్రశ్నించినట్లు తెలిసింది.

‘హమ్ దేక్ లేతే.. తూ ఫైర్ కరో ’ అని చెప్తే కాల్చాను 

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఢిల్లీకి చెందిన రియల్టర్‌‌  నమిత్ శర్మ కాల్పుల గుట్టు విప్పినట్లు తెలిసింది. రోహిత్‌‌ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి చెప్తేనే కాల్పులు జరిపానని అంగీకరించినట్లు తెలిసింది.‘‘హమ్ దేక్  లేతే.. తూ ఫైర్ కరో.  ఏంజరిగినా చూసుకుంటా. కాల్చి పారేయ్‌‌ అని రోహిత్‌‌, రితేశ్ చెప్పడంతోనే కాల్పులు జరిపాను. ఆరోజు పార్టీ జరుగుతున్న సమయంలో లోపలికి వచ్చింది పోలీసులని తెలియదు. ల్యాంగ్వేజ్  ప్రాబ్లం వల్ల ఏం మాట్లాడుతున్నారో తెలియలేదు. నాపై అటాక్ చేయడానికి వచ్చారేమో అనుకుని కాల్పులు జరిపాను’’ అని నమిత్ శర్మ స్టేట్‌‌మెంట్‌‌ ఇచ్చినట్లు తెలిసింది.