
- టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు..
- నేడు హైకోర్టుకు సిట్ రిపోర్టు
- సీల్డ్ కవర్‌లో అందజేయనున్న అధికారులు
- అరెస్టులు, విచారణ అంశాల ప్రస్తావన
- చైర్మన్, సెక్రటరీ ఎంక్వైరీ రిపోర్టు జత
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ స్టేటస్ రిపోర్టు రెడీ అయ్యింది. బేగంబజార్ పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ సహా ఇన్వెస్టిగేషన్ సందర్భంగా బయటికొచ్చిన కీలక అంశాలతో కూడిన స్టేటస్ రిపోర్టును సిట్ రూపొందించింది. మంగళవారం సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించనుంది. పేపర్ లీకేజీ ద్వారా ఐదుగురు గ్రూప్ 1, ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్, ఇద్దరు డీఏవో పరీక్షలు రాసినట్లు గుర్తించామని సిట్ తన స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. 17 మంది నిందితులు ఇచ్చిన వివరాలతో అనుమానితులందరిని విచారిస్తున్నామని, ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని తమ రిపోర్టులో వివరించినట్లు తెలిసింది.
బల్మూరి వెంకట్ పిటిషన్‌తో స్టేటస్ రిపోర్ట్ ఆర్డర్
పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలివ్వాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పోయిన నెల 21న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3.50లక్షల మంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారని, అందులో 25వేల మంది సెలెక్ట్ అయ్యారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆరు పరీక్షలు రద్దు చేశారని కోర్టుకు వివరించారు. సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఏప్రిల్ 11న స్టేటస్ రిపోర్టు సబ్మిట్ చేయాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు సిట్ సీల్డ్ కవర్‌లో స్టేటస్ రిపోర్టు మంగళవారం అందజేయనుంది.
17 మంది అరెస్ట్.. 450 మందికి పైగా విచారణ
ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో పాటు మొత్తం 17 మంది నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలతో స్టేటస్ రిపోర్ట్ తయారు చేసింది. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా 450 మందికి పైగా విచారించామని పేర్కొన్నట్లు సమాచారం. అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 పేపర్ ఎప్పుడు లీక్ చేశారనే వివరాలను వెల్లడించింది. ఇందులో 100కు పైగా మార్కులు వచ్చిన వారిలో 121 మందిని విచారించినట్లు రిపోర్ట్‌లో తెలిపింది. జగిత్యాల జిల్లా మాల్యాలకు చెందిన 35 మంది వివరాలను కూడా రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిలు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ను ప్రస్తావించినట్లు తెలిసింది.
మూడు పేపర్ల లీక్‌పై ప్రస్తావన
ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి పేపర్స్ లీకేజీ చేసినట్లు తమ ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడైందని స్టేటస్ రిపోర్ట్‌లో వివరించినట్లు సమాచారం. ప్రవీణ్ ద్వారా అదే సెక్షన్‌లో పనిచేసిన దామెర రమేశ్, సురేశ్‌లకు రాజశేఖర్‌రెడ్డి ద్వారా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, న్యూజిలాండ్‌లోని ప్రశాంత్ రెడ్డికి గ్రూప్1 పేపర్ చేరిందని రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. ఏఈ క్వశ్చన్ పేపర్ రేణుక నుంచి ఆమె భర్త ఢాక్య నాయక్, తమ్ముడు రాజేశ్వర్ కు వెళ్లినట్లు రిపోర్ట్‌లో ప్రస్తావించినట్లు సమాచారం. ప్రవీణ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా డీఏవో పేపర్ లీకేజీని గుర్తించినట్లు వెల్లడించింది. రూ.6 లక్షలకు పేపర్ కొన్న ఖమ్మం జిల్లాకు చెందిన సుష్మిత, ఆమె భర్త సాయి లౌకిక్ వివరాలను స్టేటస్ రిపోర్ట్‌లో వివరించినట్లు సమాచారం. నిందితుల సెల్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, పెన్‌డ్రైవ్స్, టీఎస్పీఎస్సీ సెక్షన్ఆఫీసర్కు చెందిన కాన్ఫిడెన్షియల్ సిస్టమ్, హార్డ్‌డిస్క్‌ల్లో దొరికిన డేటా గురించి రిపోర్టులో వెల్లడించినట్లు తెలిసింది.