- ఇయ్యాల ఉదయం 11 గం.కు హాజరుకావాలని సిట్ ఆదేశం
- చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ
- ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్‌రావుతో కలిసి హరీశ్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు!
- శ్రవణ్‌రావును మరోసారి విచారించే అవకాశం
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సోమవారం నార్సింగిలోని హరీశ్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లగా, ఆ టైమ్‌లో ఆయన తన సొంత నియోజకవర్గం సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. దీంతో అధికారులు నోటీస్ కాపీలను సిబ్బందికి ఇచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే హరీశ్ రావును సిట్ విచారిస్తున్నట్టు తెలిసింది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరీశ్ రావు అనుచరులను పంజాగుట్ట పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. సిట్ కూడా వారి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసినట్టు తెలిసింది. ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్ రావుతో కలిసి హరీశ్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే హరీశ్ రావుకు నోటీసులు జారీ చేసింది. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా నిందితులైన మాజీ పోలీస్ అధికారుల వాంగ్మూలాలు, టెలికం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందిన 618 నంబర్లకు చెందిన ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్‌ను ఇప్పటికే విచారించింది. వాళ్ల నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు సహా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ వివరాలు సేకరించింది.
2024 మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఎస్‌ఐబీ ఎస్‌వోటీ చీఫ్ ప్రణీత్ రావు సహా అప్పటి పోలీస్ అధికారులు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు కస్టడీలో కీలక వివరాలు వెల్లడించారు. అలాగే మాజీ సీఎస్‌లు సోమేశ్ కుమార్, శాంతికుమారి, జీఏడీ మాజీ సెక్రటరీ రఘునందన్ రావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌ను సాక్షులుగా సిట్ స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసింది. మరోవైపు చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసును పరిగణనలోకి తీసుకుంది. సిద్దిపేటలో హరీశ్ రావుకు వ్యతిరేకంగా పనిచేసినోళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇప్పటికే సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితుడైన శ్రవణ్‌రావును కూడా మరోసారి విచారించనున్నట్టు సమాచారం. పూర్తి ఆధారాలతో చార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
