- ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్, రిపోర్టర్ సుధీర్ అరెస్ట్
- రమేశ్ బ్యాంకాక్ వెళ్తుండగా ఎయిర్‌పోర్టులో పట్టుకున్న పోలీసులు
- మరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని విచారించి నోటీసులు
- రిపోర్టర్ల ఇండ్లు, ఎన్టీవీ ఆఫీసులో సోదాలు
- పరారీలో ఉన్న యూట్యూబ్ చానళ్ల ప్రతినిధుల కోసం గాలింపు
హైదరాబాద్, వెలుగు: మహిళా ఐఏఎస్‌పై అసభ్య కథనాల కేసులో సిట్ యాక్షన్ మొదలుపెట్టింది. ఆ కథనాన్ని ప్రసారం చేసిన ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్, ఆ చానల్ సెక్రటేరియెట్ రిపోర్టర్ సుధీర్‌ను బుధవారం అరెస్ట్ చేసింది. ఇదే చానల్‌కు చెందిన పొలిటికల్ బ్యూరో రిపోర్టర్ పరిపూర్ణాచారిని విచారించి నోటీసులు అందజేసింది.
దొంతు రమేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సిట్ అదుపులోకి తీసుకొని బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌కు తరలించింది. అంతకుముందు ఇమిగ్రేషన్ అధికారులకు ట్రావెల్ స్టాపింగ్ మెమో జారీ చేయగా, దొంతు రమేశ్ఎయిర్పోర్ట్ చేరుకున్న వెంటనే సిట్‌కు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇక మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత సుధీర్, పరిపూర్ణాచారి ఇండ్లలో సోదాలు చేసిన పోలీసులు.. వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకుని సీసీఎస్‌కు తరలించారు.
దొంతు రమేశ్, పరిపూర్ణాచారి, సుధీర్‌ను సిట్ ఇన్‌చార్జ్ శ్వేత ఆధ్వర్యంలో బుధవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎన్టీవీలో ప్రసారమవుతున్న ‘ఆఫ్ ది రికార్డ్’ ప్రోగ్రామ్‌లో నల్గొండకు చెందిన మంత్రి, మహిళా ఐఏఎస్‌పై టెలీకాస్ట్ చేసిన అసభ్య కథనానికి సంబంధించి విచారించారు. ఆ మంత్రి, మహిళా ఐఏఎస్ ఎవరు? ఆ సమాచారం మీకు ఎవరు ఇచ్చారు? ఏ ఆధారాలతో కథనం ప్రసారం చేశారు? అని ప్రశ్నించినట్టు తెలిసింది. ముగ్గురు అందించిన వివరాలతో స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఎన్టీవీ చైర్మన్ నరేంద్రనాథ్ చౌదరి, సీఈవో రాజశేఖర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా న్యాయ సలహా తీసుకుంటున్నట్టు తెలిసింది. విచారణ అనంతరం సాయంత్రం 5:30 గంటల సమయంలో పరిపూర్ణాచారిని విడుదల చేశారు. ప్రోగ్రాం టెలీకాస్ట్అయిన రోజు ఆయన శబరిమలలో ఉన్నట్టు సమాచారం. కాగా, దొంతు రమేశ్, సుధీర్‌కు కింగ్ కోఠి హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మళ్లీ సీసీఎస్‌కు తీసుకొచ్చారు. అక్కడ సజ్జనార్ సమక్షంలో మరోసారి విచారించారు. ఆ తర్వాత మణికొండలో జడ్జి ముందు హాజరుపరిచారు.
అరెస్టుకు కారణాలివే..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఓ మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిత్వాలను కించపరుస్తూ ఈ నెల 8న ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఈ వీడియోను ఓ పార్టీ అధికారిక చానల్ సహా యూట్యూబ్, సోషన్ మీడియా చానల్స్ వైరల్ చేశాయి. దీనిపై ఐఏఎస్, ఐపీఎస్ అసోసియేషన్లు తీవ్రంగా స్పందించాయి. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాపై కోపం ఉంటే ఇంత విషమిచ్చి చంపండి. కానీ వ్యూస్, రేటింగ్స్ కోసం మహిళా అధికారులపై నిందలు వేయకండి” అని మీడియా ముందే కన్నీరు పెట్టుకున్నారు.
కాగా, ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళా ఐఏఎస్ఆఫీసర్వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథనాలను ప్రసారం చేసిన ఎన్టీవీ, టీన్యూస్, ఇతర యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని ఐఏఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ సెక్రటరీ జయేశ్‌రంజన్ సిటీ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసుతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోల మార్ఫింగ్‌కు సంబంధించిన కేసుల్లో దర్యాప్తుకు ఆదేశిస్తూ.. డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారమే సిట్ ఏర్పాటు చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో సిట్ అధికారులు దర్యాప్తును స్పీడప్ చేశారు.
ఓవైపు విచారణ.. మరోవైపు సోదాలు
ఓవైపు ఈ ముగ్గురినీ విచారిస్తూనే.. మరోవైపు వార్తా కథనానికి సంబంధించిన వీడియో రికార్డుల కోసం బంజారాహిల్స్‌లోని ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎడిటర్ రూమ్‌లోని కంప్యూటర్, సర్వర్, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్లను ఎన్టీటీవీ సిబ్బంది అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ చూపాలంటూ నినాదాలు చేశారు. దీంతో తిరిగి వెళ్లిన పోలీసులు.. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఎన్టీవీ కార్యాలయానికి వచ్చారు. సోదాలకు సంబంధించి వివరాలు తెలిపారు.
ప్రోగ్రాంకు సంబంధించిన సర్వర్, హార్డ్ డిస్కలు అందించాలని కోరారు. కాగా, ఎన్టీవీలో ప్రసారమైన కథనాన్ని ఫొటోలు, వీడియోలతో కలిపి పలు యూట్యూబ్ చానళ్లు సహా ఓ పార్టీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియాలోనూ ప్రసారం చేశారు. దీనికి మరింత మసాలా జోడించి వైరల్చేశారు. దీంతో ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ పైనా సిట్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆయా యూట్యూబర్లు వీడియోలను డిలీట్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. పరారీలో ఉన్న యూట్యూబ్ చానళ్ల ప్రతినిధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
