సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ ప్రారంభానికి రెడీ.. ఆగస్ట్ 20 తర్వాత సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్

సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ ప్రారంభానికి రెడీ.. ఆగస్ట్ 20 తర్వాత సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
  • ఇప్పటికే రెండు పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ల ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ పూర్తి
  • వచ్చే వారంలో మూడో పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ ట్రయల్‌‌‌‌రన్‌‌‌‌కు ఏర్పాట్లు
  • స్పీడ్‌‌‌‌గా సాగుతున్న ఏన్కూరు, వైరా లింక్‌‌‌‌ కెనాల్‌‌‌‌ పనులు

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా మొత్తం మూడు పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లను ఏర్పాటు చేయగా, ఇందులో రెండింటి ట్రయల్‌‌‌‌రన్‌‌‌‌ను ఇప్పటికే సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా పూర్తి చేశారు. ఈ నెల 10లోగా మూడో పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ను కూడా కంప్లీట్‌‌‌‌ చేసేందుకు ప్లాన్‌‌‌‌ చేస్తున్నారు. ఈ నెల 15లోగా మొదటి దశలో నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్‌‌‌‌ పెట్టడంతో ఆ లోగా పనులన్నీ పూర్తయ్యేలా ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఈ నెల 20 తర్వాత సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్ట్‌‌‌‌ను ప్రారంభించి, నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఏన్కూరు మీదుగా లింక్‌‌‌‌ కెనాల్‌‌‌‌ ద్వారా వైరా రిజర్వాయర్‌‌‌‌కు గోదావరి నీటిని తరలించి, సాగర్‌‌‌‌ ఆయకట్టులోని లక్షన్నర ఎకరాలను స్థిరీకరించేలా పనులు చేస్తున్నారు. 

మూడు చోట్ల పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లు

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్‌‌‌‌ జిల్లాను కలిపి మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో 2016లో సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ నిర్మాణం  మొదలు పెట్టారు. ఇందులో భాగంగా బీజీ కొత్తూరు, పూసుగూడెం, కమలాపురంలో పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లను నిర్మించారు. ఆ పనులు ఇప్పటికే పూర్తి కావడంతో కొత్తూరులోని పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ను జూన్‌‌‌‌  27న పూర్తి చేశారు. పూసుగూడెంలో నిర్మించిన పంప్‌‌‌‌హౌజ్‌‌‌‌ ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ను సైతం గురువారం రాత్రి సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా నిర్వహించారు. ఇక కమలాపురంలోని మూడో పంప్‌‌‌‌ హౌజ్‌‌‌‌ ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ను ఈ నెల 9న నిర్వహించేలా ప్లాన్‌‌‌‌ చేస్తున్నారు.

మొదట ఆయా పంప్‌‌‌‌హౌస్‌‌‌‌లలోని రెండు మోటార్ల ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ చేస్తున్నారు. ఒక్కో మోటార్‌‌‌‌ 1500 క్యూసెక్కుల నీటిని పంప్‌‌‌‌ చేసే కెపాసిటీ కలిగి ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. వైరా రిజర్వాయర్‌‌‌‌కు మొదటనీళ్లందించిన తర్వాత మిగిలిన మోటార్లను కమిషనింగ్‌‌‌‌ చేయనున్నారు. మోటార్లను బిగించేందుకు చైనా నుంచి వచ్చిన ఇంజినీర్ల వీసా గడువు ఆర్నెళ్లు ఉండడంతో ఆ లోగానే అన్ని మోటార్లను సిద్ధం చేయాలని ప్లాన్‌‌‌‌ చేస్తున్నారు. మరోవైపు మూడేళ్లలోగా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు అందించేలా మిగిలిన కాల్వలు, టన్నెళ్లు, ఇతర పనులన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికైతే వైరా రిజర్వాయర్‌‌‌‌కు నీళ్లందించడం ద్వారా లక్షన్నర ఎకరాల సాగర్‌‌‌‌ ఆయకట్టుకు గోదావరి జలాలను అందించనున్నారు.

ముందుగా లక్షన్నర ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్లాన్‌‌‌‌

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ పనులు స్పీడందుకున్నాయి. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో ఏడున్నరేళ్ల పాటు రూ.7500 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. దీంతో ప్రాజెక్ట్‌‌‌‌ మొత్తం పూర్తయ్యే వరకు కాకుండా ముందుగా లక్షన్నర ఎకరాలకు నీళ్లిచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైరా లింక్‌‌‌‌ కెనాల్‌‌‌‌కు ప్రపోజల్‌‌‌‌ తీసుకొచ్చారు.

ప్రభుత్వ అనుమతి సైతం రావడంతో రూ.100 కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల మేర లింక్‌‌‌‌ కెనాల్‌‌‌‌ పనులు మొదలు పెట్టారు. అయితే కాల్వ పనులకు జీఐటీఎల్‌‌‌‌ సంస్థకు చెందిన గ్యాస్‌‌‌‌ పైప్‌‌‌‌లైన్‌‌‌‌ అడ్డంకిగా మారింది. దీంతో ఏపీ, గుజరాత్‌‌‌‌ చీఫ్​సెక్రటరీలతో మాట్లాడి పనులకు పర్మిషన్‌‌‌‌ తీసుకున్నారు. గ్యాస్‌‌‌‌ పైప్‌‌‌‌లైన్‌‌‌‌కు ఇబ్బంది లేకుండా 12 మీటర్ల లోతున థ్రస్ట్‌‌‌‌ బాక్స్‌‌‌‌ నిర్మిస్తున్నారు. ఇటీవల వర్షాలు, గ్యాస్‌‌‌‌పైప్‌‌‌‌లైన్‌‌‌‌ పనుల కారణంగా లింక్‌‌‌‌ కెనాల్‌‌‌‌ వర్క్‌‌‌‌ కొంత ఆలస్యం అయిందని, అయినా ప్రభుత్వం పెట్టిన డెడ్‌‌‌‌లైన్‌‌‌‌లోగా పూర్తి చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఈ నెల 20 తర్వాత ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ లోగా పనులన్నీ పూర్తయ్యేలా మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. 

ప్రాజెక్ట్‌‌‌‌ను త్వరలో ప్రారంభిస్తాం

ములకలపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ను ఈ నెలలోనే సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని వీకే.రామవరం వద్ద ట్రయల్‌‌‌‌రన్‌‌‌‌ను పరిశీలించేందుకు వచ్చారు. సాంకేతిక కారణాలతో ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ వాయిదా పడడంతో అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. రైతులు ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ సాగు వైపు దృష్టి సారించాలని, విస్తీర్ణం పెరిగితే మరో ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ 2, 3 పంప్‌‌‌‌ హౌస్‌‌‌‌ ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ను ఈ నెల 9లోగా సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ప్రభుత్వ ముఖ్య సలహాదారు పెంటారెడ్డి, కాంగ్రెస్‌‌‌‌ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్‌‌‌‌రావు, నాయకులు పర్వతనేని అమర్నాథ్, కరటూరి కృష్ణ, అడపా నాగేశ్వరరావు, బాల అప్పారావు పాల్గొన్నారు.

ఈ నెల 15లోగా పనులు పూర్తి చేస్తాం

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 15లోగా సీతారామ ప్రాజెక్ట్‌‌‌‌ పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వర్షాలు, వాతావరణం సహకరిస్తే అనుకున్న సమయంలోగా పనులు పూర్తి అవుతాయి. ఈ నెల 10లోగా మూడో పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ పూర్తవుతుంది. ఒకసారి ఒకే మోటార్‌‌‌‌ను ప్రారంభించి ట్రయల్‌‌‌‌ రన్‌‌‌‌ చేస్తున్నాం. మిగిలిన మోటార్లను కూడా గడువులోగా కమిషనింగ్‌‌‌‌ చేసి రెడీగా ఉంచుతాం.  – ఎ.శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, ఇరిగేషన్​ సీఈ, భద్రాద్రి కొత్తగూడెం