ఆప్ లో చేరిన బీజేపీ ఎమ్మెల్యే

ఆప్ లో చేరిన బీజేపీ ఎమ్మెల్యే

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేసరిసింహ సోలంకి బీజేపీకి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు. ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు  గోపాల్ ఇటాలియా సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.  మాతర్ అసెంబ్లీ స్థానం నుంచి  ప్రాతినిధ్యం వహిస్తున్న కేసరిసింహకు ఈ సారి  బీజేపీ టికెట్ కేటాయించలేదు. ఆయన  స్థానంలో కల్పేష్ పర్మార్‌ను బీజేపీ బరిలోకి దించడంతో సోలంకి పార్టీ మారారు. అటు ఆప్ ఇప్పటికే మాతర్ అసెంబ్లీ స్థానానికి మహిపత్‌సింగ్ చౌహాన్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. 

160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ నిన్న విడుదల చేసింది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గత 27 ఏళ్లుగా  గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంది.  ఆ పార్టీ ఏడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. బీజేపీని గద్దెదించాలని కాంగ్రెస్, ఆప్ ప్రయత్నాలు చేస్తున్నాయి.