పట్టణ ప్రగతిపై కౌన్సిల్​ మీటింగ్​లో గరంగరం

పట్టణ ప్రగతిపై కౌన్సిల్​ మీటింగ్​లో గరంగరం
  • గత మీటింగ్​లో ఇచ్చిన రూ.50 లక్షల వర్క్స్ ఏమాయ్యాయి.. 
  • ఫండ్స్ ​కేటాయింపు తప్ప పనులు చేస్తలేరని అసహనం
  • జీడబ్ల్యూఎంసీ మీటింగ్ లో ఆఫీసర్లను నిలదీసిన కార్పొరేటర్లు 

హనుమకొండ, వెలుగు: పట్టణప్రగతి నాలుగు విడతలు ముగిసినా.. పనులు ఎక్కడియక్కడే ఉన్నాయని, కౌన్సిల్ లో తీర్మానించిన ఏ పనులూ స్టార్ట్​ కావడం లేదని అధికార, ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లు ఆఫీసర్లపై ఫైర్​ అయ్యారు. గురువారం జీడబ్ల్యూఎంసీ జనరల్​బాడీ మీటింగ్ ​మేయర్​ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ హాలులో జరిగింది. మీటింగ్ కు చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు హాజరయ్యారు. ముందుగా ప్రజాప్రతినిధుల చేతులమీదుగా హరితహారం మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఎజెండాలోని ఎనిమిది ఎజెండా అంశాల్లో ఆరింటిని కౌన్సిల్​ఆమోదించింది. అనంతరం నాలుగో విడత పట్టణ ప్రగతి పనులు, వానాకాలంలో వచ్చే సీజనల్​ వ్యాధులపై హాట్​హాట్​గా చర్చ జరిగింది. నిధులు కేటాయింపులు తప్ప పనులు స్టార్ట్​ చేయడం లేదని, అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని కార్పొరేటర్లు మండిపడ్డారు. ఫస్ట్​ కౌన్సిల్ మీటింగ్​లో ప్రతి డివిజన్​కు కేటాయించిన రూ.50 లక్షలతో  పనులు స్టార్ట్​ కాకపోవడంపై అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఈ మీటింగ్​లో ఒక్కో డివిజన్​కు రూ.50 లక్షలు, దోమల వల్ల సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా డివిజన్​ కో ఫాగింగ్​మెషీన్​ను కేటాయించారు. 

రోడ్డు మధ్యలోని కరెంట్ పోల్స్​ఎప్పుడు తీస్తరు? 

గ్రేటర్​ పరిధిలోని 66 డివిజన్లలో కరెంట్ పోల్స్​సమస్యగా మారాయని, కొన్నిచోట్ల రోడ్ల మధ్యలో ఉంటే, ఇంకొన్ని చోట్ల  డ్రైన్ల మధ్యలో ఉన్నాయని, వాటిని తొలగించమని ఎన్నిసార్లు చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటూ కార్పొరేటర్లు మండిపడ్డారు. రోడ్లపై ఉన్నవి, తుప్పు పట్టిన, వంగిన పోల్స్​తో ప్రమాదాలు జరుగుతుండగా.. నాలాల్లో ఉన్న స్తంభాల వల్ల కాల్వలు నిండి నీళ్లన్నీ కాలనీల్లోకి వస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని కమిషనర్​ దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని కార్పొరేటర్లు వాపోయారు. ఈ విషయమై ఎలక్ట్రిసిటీ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లను అడిగితే పొంతన లేని సమాధానం చెప్పడంపై లీడర్లు, కార్పొరేటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొన్ని డివిజన్లలో డీ సిల్టేషన్​ చేయకున్నా చేసినట్లు చూపి ఫండ్స్​ మింగేశారని ఆరోపించారు. చాలామందికి నల్లా లేకున్నా  పన్నులు రావడం, కొంతమందికి డబుల్​ ట్యాక్సులు విధిస్తుండటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాగునీటి పైపులైన్లు లీకేజీలపై దృష్టి పెట్టాలని కోరారు. సమావేశంలో  డిప్యూటీ మేయర్​ రిజ్వానా షమీమ్​, పబ్లిక్​ హెల్త్, ఎన్​పీడీసీఎల్​అధికారులు పాల్గొన్నారు. 

ఎజెండాపై ఎమ్మెల్సీ సారయ్య అసంతృప్తి

కౌన్సిల్ సమావేశాల అజెండా, సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎజెండాను ఫాలో అవడం లేదని, అలాంటప్పుడు జనరల్​బాడీ మీటింగ్​లు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. డిప్యూటీ మేయర్​కు అద్దె వాహన సదుపాయం అనే అంశం ఎజెండాలో పెట్టాల్సింది కాదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

విలీన గ్రామాలకు స్మార్ట్ సిటీ ఫండ్స్​ కేటాయించాలి

ఏండ్లు గడుస్తున్నా విలీన గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని మరింత డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ అన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కాల్వలకు వెంటనే రిపేర్లు చేయాలని కోరారు. విలీన గ్రామాలకు స్మార్ట్ సిటీ ఫండ్స్​ కేటాయించి, ఆయా గ్రామాల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని కోరారు. 

- అరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే

ప్రతి డివిజన్​కు 50 లక్షలు: మేయర్​ 

గ్రేటర్​ పరిధిలో మున్సిపల్​జనరల్ ఫండ్​ కింద రూ.151 కోట్లతో 457 పనులు జరుగుతున్నాయని, రూ.191.3 కోట్లతో 1,163 టెండర్​ ప్రక్రియలో ఉన్నాయని మేయర్ ​గుండు సుధారాణి పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కింద గ్రేటర్​ పరిధిలో రూ.41.91 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. మరో రూ.31.88 కోట్లతో చేపట్టనున్న114 పనులు టెండర్​ ప్రక్రియలో ఉన్నాయన్నారు. పట్టణ ప్రగతి కింద ప్రతి డివిజన్​కు రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు వివరించారు. పట్టణ ప్రగతిలో వివిధ విభాగాలకు సంబంధించిన నమోదైన 6,224 ఫిర్యాదుల్లో  1802 పరిష్కరించామని, మిగతా వాటిని సాల్వ్​ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగరంలో 20 మెయిన్​ రోడ్లు, 40 కాలనీలను ముంపు ప్రాంతాలుగా గుర్తించి, ప్రత్యేక బృందాలతో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలను ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహిస్తామని, ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసేలా ఇంటింటికీ జెండాలు పంపిణీ చేస్తామన్నారు. అంతకుముందు గ్రేటర్​ కమిషనర్​ ప్రావీణ్య మాట్లాడుతూ బల్దియా పరిధిలో  10 అన్నపూర్ణ క్యాంటీన్లను నిర్వహిస్తున్నామన్నారు.