మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన శివ బాలకృష్ణ

మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన శివ బాలకృష్ణ

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఏసీబీ కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఒకసారి బెయిల్ ను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. కస్టడీ కూడా ముగిసినందుకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో బాలకృష్ణ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేయనుంది. ప్రస్తుతం శివ బాలకృష్ణ చంచల్ గూడ జైల్ లో ఉన్నారు.

ఏం జరిగిందంటే?

పెద్దఎత్తున అక్రమాస్తులను కూడబెడుతూ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ కేసులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. శివబాలకృష్ణ కేసు వివరాలు ఇవ్వాలని ఏసీబీని కోరింది. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాల వివరాలను ఇవ్వాలని ఏసీబీని ఈడీ సూచించింది.

శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తులో అందరూ ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూ.250 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను పోగుచేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు విచారణలో తేలింది.

శివబాలకృష్ణ పేరిట మొత్తం 29 ఇళ్ల స్థలాలు ఉండగా ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం, విజయనగరంలో కూడా స్థలాలు ఉన్నట్లు కనుక్కున్నారు. ప్రస్తుతం శివ బాలకృష్ణ నివాసముంటున్న విల్లాతో పాటు హైదరాబాద్‌లో 4 అలాగే రంగారెడ్డి జిల్లాలో 3 బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్లు ఉన్నట్టు విచారణలో బయటపడింది. దీంతో కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది ఏసీబీ.