బీఆర్ఎస్ ఎంపీల చూపు.. కాంగ్రెస్ వైపు!..

బీఆర్ఎస్ ఎంపీల చూపు.. కాంగ్రెస్ వైపు!..
  • వీరిలో నలుగురు లోక్ సభ,ఇద్దరు రాజ్యసభ సభ్యులు
  • ఎంపీ టికెట్​, ఎమ్మెల్సీ పదవులపై హామీ కోసం ఢిల్లీలో ప్రయత్నాలు  

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో బీఆర్ఎస్ ఎంపీలు కొందరు ఆ పార్టీలో చేరాలని చూస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్​లోనే ఉంటే రాజకీయంగా అవకాశాలు కోల్పోతామనే అభిప్రాయంతో వారున్నారు. నలుగురు లోక్ సభ ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలోనూ ఉన్నారు. మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా వాళ్ల బాటలోనే నడుస్తున్నారు. లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా వీళ్లంతా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక నాయకుడైతే ఎమ్మెల్సీతో పాటు కేబినెట్ బెర్త్ పైనా ఆశలు పెట్టుకున్నట్టు తెలిసింది. 

ఇద్దరు రిజర్వ్ డ్ స్థానాల ఎంపీలు.. 

కాంగ్రెస్​లో చేరాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ ఎంపీల్లో రిజర్వుడ్ స్థానాల నుంచి గెలిచినోళ్లు ఇద్దరు ఉన్నారు. వాళ్లు తమకున్న పరిచయాలతో ఢిల్లీలో ప్రయత్నాలు చేయడంతో పాటు ఆయా ఉమ్మడి జిల్లాల్లోని కాంగ్రెస్ కీలక నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో  ఉన్నారు. ఈ రెండు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఒకచోట 7, మరోచోట 5 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలుపొందింది. ఇక వ్యాపారవేత్తలైన మరో ఇద్దరు ఎంపీలు సైతం కారు దిగేందుకు రెడీగా ఉన్నారు. ఒక ఎంపీ అయితే కాంగ్రెస్ టికెట్ దక్కకుంటే, బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి కూడా సుముఖంగా లేరని తెలిసింది. గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నట్టే, ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ దక్కించుకునే పనిలో ఆ ఎంపీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరో ఎంపీ రెండుసార్లు బీఆర్ఎస్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశం లేదని లెక్కలు వేసుకుని, కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఇద్దరు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కూడా కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వారిద్దరూ ఎమ్మెల్సీ పదవుల కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం. ఒకరైతే కుల సమీకరణాల్లో భాగంగా కేబినెట్ బెర్త్ పైనా ఆశలు పెట్టుకున్నట్టు తెలిసింది. ఆయన బీసీల్లోని ప్రధాన కులానికి చెందిన నేత కావడం, ఆ కులం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మరో పదవి దక్కడంతో.. మంత్రి పదవి తనకు వస్తుందనే లెక్కలు వేసుకుంటునట్టు తెలుస్తోంది. 

మరికొందరు కూడా.. 

ఈ ఆరుగురు ఎంపీలతో పాటు బీఆర్ఎస్ లోని పలువురు నేతలు కూడా కాంగ్రెస్ లోక్ సభ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు సహా పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారిలో కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు  దక్కించుకున్నారు. అప్పట్లో ఆ లీడర్లను కట్టడి చేసేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్​లో ఉండటం కన్నా ఆ పార్టీలో చేరడమే మంచిదనే అభిప్రాయంలో కొందరు నేతలు ఉన్నారు. అలా రెడీగా ఉన్న వారిలో కాంగ్రెస్ ఎంతమందిని చేర్చుకుంటుంది? ఎంత మందికి రాజకీయంగా అవకాశాలు ఇస్తుందనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టిసారించింది. నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జ్​లను కూడా నియమించింది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే యోచనలో హస్తం నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చే వారిలో గెలిచే అవకాశం ఉన్న వారిని చేర్చుకునే అవకాశం ఉందని సమాచారం.