- డిసెంబర్ 30 నుంచి జనవరి 4 వరకు కొనసాగిన అధ్యయనోత్సవాలు
- సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఆర్జిత సేవలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆరు రోజులుగా జరుగుతున్న అధ్యయనోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి అలంకార సేవతో అధ్యయనోత్సవాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 30న మొదలైన అధ్యయనోత్సవాలు.. జనవరి 4 వరకు ఆరు రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా అర్చకులు డిసెంబర్ 30 నుంచి రోజుకు రెండు అవతారాల్లో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
ఉదయం ఆలయంలో స్వామివారికి నిత్యారాధనలు ముగిసిన అనంతరం.. స్వామివారిని రకరకాల పూలు, వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం స్వామివారి అలంకార సేవను ప్రధానాలయ తిరువీధుల్లో విహరింపజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం అద్దాల మండపంలో ప్రత్యేక వేదికపై స్వామివారి సేవను అధిష్టింపజేసిన అర్చకులు.. శ్రీలక్ష్మీనరసింహస్వామి అవతార విశిష్టతను భక్తులకు ప్రవచించారు. ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం వంటి నిత్య కైంకర్యాలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.
