సిరిసిల్లకు ఆరు మృతదేహాలు..మిన్నంటిన రోదనలు

సిరిసిల్లకు ఆరు మృతదేహాలు..మిన్నంటిన రోదనలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెను విషాదం అలుముకుంది. అప్పటివరకు కళ్లముందే తిరుగాడిన వారు.. విగతజీవులై తిరిగి గ్రామానికి రావడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

వివరాల్లోకి వెళ్తే.. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ సోదరుడు బొల్లి రాజు కుమారుడు.. బొల్లి రాజు, ఆయన భార్య లాస్య, ఎనిమిదేళ్ల కుమార్తె రిషికతో పాటు.. అల్లుడు కోడం శ్రీనివాస్, మనవళ్లు మాధవ్, కృష్ణచంద్రలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నిన్నటి వరకు నవ్వుతూ గడిపిన ఆరుగురు సభ్యులు చనిపోవడంతో  సిరిసిల్ల పట్టణం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

మే 2న శనివారం ఉదయం ఈ ఆరు మృతదేహాలను సిరిసిల్లకు తరలించారు. అంబులెన్స్‌ల నుంచి మృతదేహాలు కిందకు దించుతుంటే.. అక్కడ చేరిన బంధువులు, స్థానికుల కళ్ళు చెమర్చాయి. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కూతురు శ్వేత ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదనతో ప్రార్థిస్తున్నారు. 

 శంషాబాద్ ఓఆర్ఆర్ పెద్దగోల్కోండ ఎగ్జిట్ 16 దగ్గర ఆగి ఉన్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీళ్లంతా యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.