కూకట్ పల్లి JNTU ఫ్లైఓవర్ పై ఘోరం.. కరెంటు పోల్ ను ఢీకొన్న కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు..

కూకట్ పల్లి JNTU ఫ్లైఓవర్ పై ఘోరం.. కరెంటు పోల్ ను ఢీకొన్న కారు.. ఆరుగురికి తీవ్ర గాయాలు..

హైదరాబాద్ లోని కూకట్ పల్లి జేఎన్టీయు ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు వేగంగా వచ్చి కరెంటు పోల్ ను ఢీకొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ( అక్టోబర్ 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్తున్న టాటా కర్వ్ కారు అతివేగంగా వచ్చి కరెంటు పోల్ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి కరెంటు పోల్ ను ఢీకొన్న కారు అటుగా వస్తున్న కారుపై పడింది.

ఈ ఘటనలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కరెంటు పోల్ ను ఢీకొన్న కారులో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దాదాపు అరగంటసేపు శ్రమించి డ్రైవర్ ను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు.

కారులో ప్రయాణిస్తున్నవారికి గాయాలు మినహా ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన తెల్లవారుజామున జరగడంతో ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.