శ్రీవిద్య సూసైడ్ ఘటనలో.. ఆరుగురు విద్యార్థినులు సస్పెన్షన్

శ్రీవిద్య సూసైడ్ ఘటనలో.. ఆరుగురు విద్యార్థినులు సస్పెన్షన్

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో కలకలం రేపిన ఎంఎస్సీ కెమిస్ట్రీ సెకండియర్ విద్యార్థిని పెద్దమళ్ల శ్రీవిద్య(22) ఆత్మహత్య ఘటనలో ఆరుగురు విద్యార్థినులను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ఒక సెమిస్టర్ పాటు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్​ వి.రామచంద్రం బుధవారం సాయంత్రం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన విద్యార్థిని శ్రీవిద్య కేయూలోని పద్మాక్షి హాస్టల్‌‌‌‌లో ఉంటూ చదువుతోంది. హాస్టల్‌‌‌‌లో ఆరుగురు సీనియర్ స్టూడెంట్స్​ తనపై దొంగతనం నెపం వేయడంతో పాటు పలుమార్లు రూమ్‌‌‌‌లో దాడి చేశారని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

హాస్టల్‌‌‌‌లో సీనియర్లతో జరిగిన గొడవ తర్వాత మార్చి 7, 8 తేదీల్లో ఆమె తన అమ్మమ్మ ఇంట్లో ఎలుకల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అనంతరం హైదరాబాద్‌‌‌‌లోని నిమ్స్​లో చికిత్స పొందుతూ మార్చి 16న మృతి చెందింది. మరణానికి ముందు ఆమె ఆరుగురు సీనియర్ల పేర్లు చెబుతూ, వారు తనను కొట్టడం వల్లే సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు వెల్లడించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్​ వి. రామచంద్రం విచారణ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. విద్యార్థినులకు సంబంధించిన సున్నిత అంశం కావడంతో కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ విభాగాలకు చెందిన మొత్తం ఆరుగురు విద్యార్థినులపై ఒక సెమిస్టర్ పాటు సస్పెన్షన్ విధించాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రస్తుతం యూనివర్సిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.