పిడుగు పాటుకు రాష్ట్రంలో ఆరుగురు మృతి

పిడుగు పాటుకు రాష్ట్రంలో ఆరుగురు మృతి

బతుకమ్మ పండుగ పూట రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఆరుగురు చనిపోయారు. సిద్దిపేటలో బతుకమ్మ నిమజ్జనానికి చెరువు దగ్గరికి వెళ్లిన సమయంలో పిడుగు పడటంతో పస్తం శ్రీనివాస్(34), వానరాశి బాలరాజ్(36) చనిపోయారు. చెన్నూరి సారయ్య(30)కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు మంత్రి హరీశ్ రావు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నంలో రైతు ఎన్కేపల్లి మల్లేశం ముదిరాజ్​(45) పొలం పనుల్లో ఉండగా పిడుగు పడి చనిపోయారు. కూలీ పనులు చేసుకుంటున్న పెండ అంజిలమ్మ,  బ్యాగరి అనంతమ్మ, మరో రైతు ఎన్కేపల్లి మల్లయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పిడుగులు పడి కరకగూడెం మండలం చొప్పాల గ్రామంలో పల్లెపాక స్రవంతి (23), కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలో తిరుమలరావు (22) చనిపోయారు. మంచిర్యాల జిల్లా తిర్యాణి మండలంలోని ఖైరిగూడకు చెందిన కనక ఇంద్రుబాయి(45) ఆదివారం పొలం కలుపు తీస్తుండగా పిడుగు పడి చనిపోయింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.