
- కమీషన్ల కోసం మాత్రం కాళేశ్వరం కట్టిన్రు
- కేసీఆర్, కేటీఆర్‌కు సిగ్గుండాలె
- ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ పనులు పరిశీలించిన మంత్రి
మేడిపల్లి, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేండ్లలో ఆరు కిలో మీటర్ల ఉప్పల్– నారపల్లి ఫ్లై ఓవర్ కట్టలేకపోయిందని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కమీషన్లు వస్తాయని మాత్రం కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు. తెలంగాణకు ఎంతో అవమానకరమన్నారు. ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు.
కాంట్రాక్టర్ పనులు కంప్లీట్ చేయకపోతే టెండర్లు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఫ్లై ఓవర్ నిర్మాణ ఖర్చు అదనంగా సుమారు రూ.300 కోట్లు పెరుగుతున్నదని అన్నారు. మళ్లీ టెండర్లు పిలిచి పనులు కంప్లీట్ చేస్తామని తెలిపారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు అక్టోబర్ 1 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు.
‘‘కేంద్ర, గత బీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. కొన్ని రోజుల కిందే ఈ విషయమై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. 2018లో రూ.600 కోట్లతో పనులు ప్రారంభించారు. నిధుల కొరత కారణంగా 7.2 కిలో మీటర్ల పొడవు ఉన్న ఫ్లై ఓవర్ పనులు ఆగిపోయాయి. ఆరేండ్ల నుంచి ఎలివేటెడ్ కారిడార్ పనులు పట్టించుకోలేదు. కేటీఆర్ ఇంగ్లీష్‌లో మాట్లాడటం.. సెల్ఫీలు దిగడం తప్ప హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిందేమీ లేదు’’అని అన్నారు.
కొత్త టెండర్లతో ఖర్చు పెరుగుతది
గతంలో ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల గురించి పార్లమెంట్లో చాలా సార్లు ప్రస్తావించారని వెంకట్‌రెడ్డి గుర్తుచేశారు. కొత్త టెండర్లతో నిర్మాణ ఖర్చు రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర పెరుగుతున్నదన్నారు. ‘‘వర్షాకాలం వల్ల రోడ్లన్నీ దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్.. పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసింది. మూసీ నది అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రపంచ బ్యాంకుతో మాట్లాడి సీఎం రేవంత్ నిధులు తీసుకొస్తారు. రూ.31 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిదే. అసెంబ్లీలో మేము మహిళలను కించపర్చలేదు. కాంగ్రెస్ హయాంలో పదవులు అనుభవించి పార్టీ మారిన వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి’’అని అన్నారు.
కాంగ్రెస్ మాట ఇస్తే..మడమ తిప్పదు
అసెంబ్లీలో 65 గంటల్లో 45 గంటలు ప్రతిపక్ష నేతలే మాట్లాడారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ‘‘అసెంబ్లీకి రాని వ్యక్తికి ఎమ్మెల్యే పదవి అవసరమా? కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదు. రాబోయే 15 ఏండ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటది. రూ.175 కోట్లతో కట్టిన కేబుల్ బ్రిడ్జి.. సెల్ఫీలు దిగడానికి మాత్రమే పనికొస్తది. రానున్న రోజుల్లో అసెంబ్లీ సీట్లు పెరిగే చాన్స్ ఉంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు రాబోతున్నయ్. అందులో మేము 135 స్థానాల్లో గెలుస్తం. మళ్లీ రేవంత్ రెడ్డినే సీఎం అవుతరు’’అని వెంకట్‌రెడ్డి అన్నారు.