- అధిష్టానానికి ఆరుగురి పేర్లు
- పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠ
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎంపిక పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో డీసీసీ అధ్యక్షున్ని ప్రకటించే అవకాశం ఉండటంతో ఈ పీఠం ఎవరిని వరిస్తోందనే చర్చ ప్రారంభమైంది. సిద్దిపేట డీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు ఆశావహులు ధరఖాస్తులు సమర్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లో వుండటంతో పాటు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డీసీసీ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
అక్టోబరు 14 నుంచి 17వ తేదీ వరకు ఏఐసీసీ ఆబ్జర్వర్ జ్యోతి రౌతేలా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో (సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక) ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పదవిని ఆశించే వారి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. నాలుగు నియోజకవర్గాల నుంచి దాదాపు 120కిపైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. కిందిస్థాయి కార్యకర్తల నుంచి ముఖ్య నేతల వరకు అందరూ ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నారు.
డీసీసీ ఆశిస్తున్న ముఖ్య నేతలు
సిద్దిపేట డీసీసీ అధ్యక్ష పదవిని జిల్లాకు చెందిన కొందరు ముఖ్య నేతలు ఆశిస్తున్నారు. మారిన నిబంధనల ప్రకారం పార్టీలో క్రియశీలకంగా వ్యవరిస్తున్న వారికే ప్రాధాన్యత ఇస్తుండటంతో జిల్లాలో సీనియర్ నేతలు డీసీసీ పదవి ని ఆశిస్తుండటం గమనార్హం. పార్టీని నమ్ముకుని చాలాకాలంగా పనిచేస్తున్న వారితో పాటు ఐదేండ్ల క్రితం పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత నివ్వాలని పార్టీ యోచిస్తుండటంతో సీనియర్లు పలువురు డీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు.
సిద్దిపేట నియోజకవర్గం నుంచి పూజల హరికృష్ణ, తాడూరి శ్రీనివాస గౌడ్, గూడూరి శ్రీనివాస్, దర్పల్లి చంద్రం, లక్కరసు సూర్యవర్మ, దుబ్బాక నియోజకవర్గం నుంచి శ్రవణ్ కుమార్ రెడ్డి, గాడిపల్లి రఘువర్థన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, గజ్వేల్ నియోజకవర్గం నుంచి తూంకుంట నర్సారెడ్డి, ఆంక్షా రెడ్డి, బండారి శ్రీకాంత్, నాయిని యాదగిరి, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బస్వరాజు శంకర్, మద్దూరు మండలం నుంచి గిరి కొండల్ రెడ్డిలతో పాటు పలువురు ముఖ్య నేతలు దరఖాస్తులు సమర్పించుకున్నారు.
అధిష్టానానికి చేరిన ఆరుగురి పేర్లు
సిద్దిపేట డీసీసీ అధ్యక్ష పదవి కోసం అందిన ధరఖాస్తుల్లోంచి ఆరు గురి పేర్లు అధిష్టానికి పంపించారు. ఎఐసీసీ ఆబ్జర్వర్ జ్యోతి రౌతేలా ధరఖాస్తులు స్వీకరించి ఆశావహులతో ఇంటర్వూలు నిర్వహించిన తరువాత వడపోత కార్యక్రమం తరువాత ఆరుగురి పేర్లు డిల్లికి పంపినట్టు తెలుస్తోంది. డీసీసీ పదవిని కోసం ధరఖాస్తు చేసుకున్న వారిలో దర్పల్లి చంద్రం, పూజల హరికృష్ణ, శ్రవణ్ కుమార్ రెడ్డి, జి.వేణుగోపాల్, గిరి కొండల్ రెడ్డి, రఘువర్థన్ రెడ్డి ల పేర్లు అధిష్టానికి చేరిందనే ప్రచారం జోరుగా సాగుతుండటం గమనార్హం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో వచ్చే కొద్ది రోజుల్లో డీసీసీ అధ్యక్షుని పేరు ప్రకటించే అవకాశం వుండటంతో ఆశావహులు తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తుకుంటున్నారు.
ఓసీకా...? బీసీకా.....?
సిద్దిపేట డీసీసీ అధ్యక్ష పదవి ఓసీకా లేక బీసీ కా దక్కుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. సిద్దిపేట జిల్లా ఏర్పాటైన తరువాత మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి డీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతూ వస్తున్నారు. నూతన జిల్లా ఏర్పాటైన తరువాత కొం త కాలం ఉమ్మడి జిల్లా అధ్యక్షున్నే సిద్దిపేట డీసీసీ అధ్యక్షునిగా కొనసాగించగా తరువాత తూంకుంట నర్సారెడ్డి కి ఈ బాధ్యతల్ని అప్పగించారు. దాదాపు ఐదేండ్లుగా తూంకుంట నర్సారెడ్డి డీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్ద పీట వేస్తుండటంతో ఈసారి డీసీసీ అధ్యక్ష పదవి బీసీలకే దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా ఒకటి రెండు రోజుల్లో సిద్దిపేట డీసీసీ పీఠం ఎవరిని వరిస్తోందనన్న ఉత్కంఠ తెరపడే అవకాశం వుండగా ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలను మాత్రం వీడక పోవడం గమనార్హం.
