
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన ఆరుగురు గురువారం భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో నాలుగో ప్లటూన్‌కు చెందిన కుంట ఏరియా కమిటీ మెంబర్లుమడకం లక్మ, సోడి భీమ, సోడి రాజె, మిలీషియా డిప్యూటీ కమాండర్ మడవి సోన, మిలీషియా మెంబర్లు మడవి భీమ, మడకం భీమయ్య ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్ట్‌లకు తక్షణ సాయం కింద రూ. 25 వేల చొప్పున అందజేశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 306 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ బి.రోహిత్‌రాజు తెలిపారు.
పేలిన ప్రెషర్ బాంబ్.. ఎస్సైకి గాయాలు
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్ జిల్లా బీజాపూర్ జిల్లాలో మావోయిస్ట్‌లు అమర్చిన ప్రెషర్ బాంబ్ పేలి ఓ ఎస్సైకి గాయాలు అయ్యాయి. డీఆర్జీకి చెందిన ఎస్సై ప్రకాశ్ చట్టీ గురువారం తన బలగాలతో బైరంగఢ్ పీఎస్ పరిధిలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ప్రెషర్ బాంబ్‌పై కాలు వేయడంతో అది ఒక్కసారిగా పేలడంతో ఎస్సైకి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన తోటి సిబ్బంది వెంటనే బీజాపూర్ హాస్పిటల్‌కు తరలించారు.
మావోయిస్ట్ స్మారక స్తూపం ధ్వంసం
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుండ్రాజుగూడెం, బాద్సేన్‌పల్లి, మంగల్తోర్, ఉద్యమల్ల అడవుల్లో గురువారం కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉద్యమల్ల అడవుల్లో మావోయిస్ట్‌లు నిర్మించిన స్తూపాన్ని బలగాలు ధ్వంసం చేశాయి. అలాగే తెర్రం ప్రాంతంలోని కోమటపల్లి అడవుల్లో మావోయిస్ట్‌లకు చెందిన బర్మార్ తుపాకులు, బీజీఎల్ రౌండ్లు, రాడ్లు, బీజీఎల్ తయారీకి ఉపయోగించే విడి భాగాలు, పీఈకే యూరియా, విద్యుత్ వైర్లు, మందు గుండు సామగ్రి, ప్రెషర్ కుక్కర్లు, బ్లేడ్లు, స్పీకర్లు స్వాధీనం చేసుకున్నారు.