మణిపూర్ అల్లర్లు.. 24 గంటల్లో ఆరుగురు మృతి

మణిపూర్ అల్లర్లు.. 24 గంటల్లో ఆరుగురు మృతి

గువాహటి: మణిపూర్​లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. బిష్ణుపూర్– చురచాంద్​పూర్ జిల్లాల సరిహద్దు వద్ద శనివారం పొద్దున మొదలైన ఘర్షణలు ఆదివారం కూడా కొనసాగాయి. 24 గంటల్లో మొత్తం ఆరుగురు చనిపోయారు. మృతుల్లో తండ్రీకొడుకులు ఉన్నారు. మొత్తం 16 మంది గాయపడ్డారు. మణిపూర్ పోలీసులు ఆర్మీతో కలిసి రెండు జిల్లాల సరిహద్దులో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. బుల్లెట్ తగిలి గాయపడిన ఒక తిరుగుబాటుదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 10 కంపెనీల పారా మిలిటరీ బలగాలను మణిపూర్​లో మోహరించాలని కేంద్రం భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్​లో కర్ఫ్యూ సడలింపు ఉండకపోవచ్చని వివరించాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పాయి.

రోజంతా గ్రనేడ్​తో దాడులు

ఆదివారం కూడా బిష్ణుపూర్–చురచాంద్​పూర్ జిల్లాల సరిహద్దు వద్ద మోర్టార్, గ్రనేడ్ దాడులు జరిగాయి. భద్రతాదళాలు, తిరుగుబాటుదారుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. చురచాంద్​పూర్ జిల్లాలో పక్కపక్కనే ఉన్న ఫౌజాంగ్, సాంగ్​డో గ్రామస్తులు ఫైరింగ్ చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. అదేవిధంగా, బిష్ణుపూర్ జిల్లాలోని టెరాఖోంగ్​సాంగ్బీ వద్ద జరిగిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు.