పుట్టినరోజే తల్లిదండ్రులకు కడుపుకోత

పుట్టినరోజే తల్లిదండ్రులకు కడుపుకోత
  • ఈత కోసం వాగులో దిగిన ఆరుగురు పిల్లలు
  • ఇప్పటివరకు ఐదు మృతదేహాల వెలికితీత

పిల్లల ఈత సరదా ప్రాణం తీసింది. ఈత కోసం వాగులో దిగిన విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల పరిధిలోని మానేరువాగులో జరిగింది. సిరిసిల్ల టౌన్‌కు చెందిన 8 మంది స్టూడెంట్లు.. వెంకంపేట ప్రభుత్వ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. సోమవారం మానేరువాగులోని చెక్ డ్యాంలో ఈత కొట్టేందుకు వెళ్లారు. నీటి లోతు తెలియక అందులోకి దిగిన ఆరుగురు మునిగిపోయారు. దీంతో మిగిలిన స్టూడెంట్లు భయంతో అక్కడి నుంచి పారిపోయారు.

వాగుకు దగ్గర్లో ఉన్న ఉన్న రైతులు.. పిల్లలు నీటిలో గల్లంతైన విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన కొలిపాక గణేశ్ డెడ్ బాడీ దొరికింది. గల్లంతైన వెంకట సాయి, క్రాంతి, రాకేశ్‌‌‌‌, అజయ్.. మృతదేహాల్ని కూడా వెలికితీశారు. మరో విద్యార్థి మనోజ్ కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 

వీరి మృతదేహాల్ని పోస్టు మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల్లో క్రాంతి పుట్టినరోజు ఇవాళ కావడంతో అతని కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో మృతి చెందిన మరో విద్యార్థి రాకేశ్ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. రాకేశ్ తండ్రి వీరేశం నేత కార్మికుడు. అమ్మ బీడీ కార్మికురాలు. అయితే వీరికి వివాహైన 13 ఏళ్లకు రాకేశ్ పుట్టాడు. లేక లేక పుట్టిన బిడ్డ మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మరోవైపు ఈ దుర్గటనపై మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయాన్నే కలెక్టర్, ఎస్పీతో మాట్లాడిన కేటీఆర్ సంఘటన స్థలంలోనే ఉండి గాలింపు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.