
కొలీజియం తీర్మానాల్లో అస్పష్టత అనేది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. కొలీజియం సిఫారసుల్లో పారదర్శకత అనేది చాలాకాలంగా సమస్యగా మారిపోయింది. ఒక్కో ప్రధాన న్యాయమూర్తి కాలంలో కొలీజియం తీర్మానాలను ఒక్కోరకంగా ప్రచురిస్తారు. జవాబుదారీతనం గురించి, పారదర్శకత గురించి చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు నొక్కి చెబుతుంది. కానీ, సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. న్యాయమూర్తుల ఎంపిక కార్యనిర్వాహక వ్యవస్థ దగ్గర ఉండడం మంచిదా, కొలీజియం వ్యవస్థ ఉండాలా అన్న చర్చ ప్రతి సందర్భంలోనూ వస్తుంటోంది.
న్యాయవ్యవస్థ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరిగా ఉంది. పెనం మీద ఉండాలా..పొయ్యిలో ఉండాలా అన్న పరిస్థితి. ఇప్పుడు పెనమే పొయ్యి మాదిరిగా మారిపోతున్నట్టు అనిపిస్తున్నది.మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్ర చూడ్ పదవీకాలంలో న్యాయమూర్తుల సీనియారిటీతోపాటు, ప్రాంతీయ, కుల, లింగ వైవిధ్యం వంటి విషయాలను వివరంగా పేర్కొంటూ కొలీజియం సిఫారసులను ప్రచురించేవారు. ఆ తరువాత సంజీవ్ ఖన్నా పదవీకాలంలో కొలీజియం తీర్మానాలు మరింత కఠినంగా మారినప్పటికీ అవి న్యాయమూర్తుల సీనియారిటీ వంటి అంశాలను హైలైట్ చేస్తూనే వచ్చాయి.
ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్ కాలంలోని కొలీజియం ప్రకటనలో ఈ విషయాలేవీ కనిపించడం లేదు. వైవిధ్య పరిగణనలను, సీనియారిటీని పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. కొలీజియం వ్యవస్థలో అస్పష్టత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. సోమవారం నాడు సుప్రీంకోర్టు కొలీజియం ముంబయి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాదేని అదేవిధంగా పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపుల్ మనూబాయ్ పంచోలీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది.
కానీ, ఈ రెండు పేర్లను సిఫారసు చేయడంలో కొలీజియం పరిగణించిన అంశాలకు సంబంధించి ఎటువంటి వివరాలను అందించలేదు. ఈ నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందా లేదా మెజారిటీ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్నారా అనేది ప్రకటనలో స్పష్టం చేయలేదు.
జస్టిస్ బీవీ నాగరత్న అసంతృప్తి
ప్రస్తుతం కొలీజియంలో భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, సీనియర్ న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరి, బీవీ నాగరత్న ఉన్నారు. ఈ ఐదుగురిలో నాగరత్న మాత్రమే మహిళ. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న ఏకైక మహిళా న్యాయమూర్తి. జస్టిస్ పంచోలి నియామకానికి వ్యతిరేకంగా జస్టిస్ బీవీ నాగరత్న తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు హిందుస్తాన్ టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆయన నియామకం న్యాయ నిర్వహణకు ‘ప్రతికూలమైనది’ మాత్రమే కాకుండా కొలీజియం వ్యవస్థ విశ్వసనీయత కూడా ప్రమాదంలో పడేస్తుందని ఆమె నొక్కి చెప్పారు.
గుజరాత్ హైకోర్టు నుంచి పాట్నా హైకోర్టుకి జస్టిస్ పంచోలీ బదిలీకి సంబంధించిన పరిస్థితులను కూడా ఆమె నోట్లో ప్రస్తావించింది. సుప్రీంకోర్టులోని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న ఆయన పదోన్నతిని వ్యతిరేకిస్తూ అరుదైన వివరణాత్మక అసమ్మతి ప్రకటనను జారీ చేశారు. హిందుస్తాన్ టైమ్స్ ప్రకారం.. ఈ విషయం తెలిసిన వ్యక్తుల అభిప్రాయం ప్రకారం జస్టిస్ పంచోలీకి పదోన్నతి కల్పించాలని మొదట ప్రస్తావనకు వచ్చినప్పుడు జస్టిస్ నాగరత్న విభేదించారని, ఆమె అదేవిధంగా కొలీజియంలోని మరో న్యాయమూర్తి అభ్యంతరాలను వ్యక్తపరిచారు. ఆ నేపథ్యంలో జస్టిస్ అంజారియాను పంచోలి కంటే ముందే మే నెలలో పదోన్నతి కల్పించారు.
మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు
ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న మహిళా న్యాయమూర్తి నాగరత్న మాత్రమే ఉన్నారు. కొలీజియం చివరిసారిగా 2021లో ముగ్గురు మహిళా న్యాయమూర్తులను పదోన్నతికి సిఫారసు చేసింది. ఆ తరువాత మహిళా న్యాయమూర్తులను సిఫారసు చేయలేదు. మహిళా
న్యాయమూర్తులను నియమించే విషయంలో కొలీజియం అయిష్టత చూపిస్తుందని అనిపిస్తుంది. ఉదాహరణకు నవంబర్ 21, 2013న బొంబయి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ రేవతి ప్రశాంత్ మోహిత్ డేరే, అదేవిధంగా మార్చి 31, 2014న పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లిసాగిల్ ఇద్దరూ పంచోలి కంటే సీనియర్లు.
సీనియర్ మహిళా న్యాయమూర్తులు అందుబాటులో ఉన్నారు.ఏ కారణాల వల్ల వాళ్లను పరిగణనలోకి తీసుకోలేదో అర్థంకాని విషయం. ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు సిఫారసు చేసిన న్యాయమూర్తులను చూస్తే జస్టిస్ అలోక్ అరాధే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అక్కడ ఆయన డిసెంబర్29, 2009న నియమితులయ్యారు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకి బదిలీ అయ్యారు. ఆ తరువాత కర్నాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. జులై 19, 2023 నాడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.
ఆ తరువాత జనవరి 21, 2025 నాడు బొంబయి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేసింది. ఆయన పదోన్నతిని భారత ప్రభుత్వం ఖరారుచేస్తే మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులు ఉంటారు. ఇదివరకే సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తులు జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ. సుప్రీంకోర్టులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తగిన ప్రాతినిధ్యం ఉంది. అయినా జస్టిస్ అరాదేని కొలీజియం సిఫారసు చేసింది. అందుకుగల ప్రత్యేక కారణాలు ఏమిటో మనకు తెలియదు. ముగ్గురు న్యాయమూర్తుల ప్రాతినిధ్యం అవుతుందని ఎవరూ అనకపోవడం విశేషం.
సీనియారిటీలు తారుమారు
జస్టిస్ పంచోలి విషయానికి వస్తే ఆయన అక్టోబర్ 1, 2014న గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత ఆయనను పాట్నా హైకోర్టుకి జులై 14, 2023లో బదిలీ చేశారు. జులై 21, 2025 నాడు ఆయన పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫారసు చేసింది. జస్టిస్ పంచోలి సుప్రీంకోర్టు పదోన్నతి పొందడంలో ఆయన కంటే సీనియర్లు అయిన 21మంది ప్రధాన న్యాయమూర్తులను దాటి వచ్చినట్టుగా అవుతుంది.
సీనియారిటీలు తారుమారవుతాయి. ఆయన నియామకం ఫలితంగా సుప్రీంకోర్టులో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు న్యాయమూర్తులు ఉంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న గుజరాత్‌కి చెందిన న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, ఎఎన్ ఆంజారియా. విశాలమైన భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని వర్గాలకు, మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే నిర్ణయాల్లో దేశీయత ప్రతిబింబిస్తుంది. విశ్వసనీయత పెరుగుతుంది. రెండు రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులే ఆరుగురు ఉండటం ఫెడరల్ స్వభావానికి విరుద్ధంగా కనిపిస్తుంది. గండికోట రహస్యాలు తెలియవచ్చు. కానీ, కొలీజియం సిఫారసు వివరాలు తెలియడం కష్టంగా మారుతుంది. మార్పుని ఆశించడం తప్ప చేయగలిగిందేమీ లేదా? ఇది న్యాయకోవిదులు ఆలోచించాలి.
- డా. మంగారి రాజేందర్,
జిల్లా జడ్జి (రిటైర్డ్)