ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్లను‌‌‌‌ తిరస్కరిస్తున్న కలెక్టర్లు

ధరణిలో పెట్టుకున్న అప్లికేషన్లను‌‌‌‌ తిరస్కరిస్తున్న కలెక్టర్లు

 

  • సిట్ అటాచ్ చేసిన భూముల సర్వే నంబర్లన్ని ప్రొహిబిటెడ్ లిస్టులో
  • అవే సర్వే నంబర్లలో భూములున్న ‌‌‌‌ఇతర రైతులకు తప్పని‌‌‌‌ తిప్పలు
  •   అవసరానికి  అమ్ముకోలేని‌‌‌‌ దుస్థితి
  •    తహసీల్దార్ లెటర్లు రాసినా క్లారిటీ ఇవ్వని సిట్

హైదరాబాద్, వెలుగు: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్​కౌంటర్లో చనిపోయి ఆరేండ్లయినా అతడి అక్రమాస్తుల కేసు ఎంక్వైరీ ఇంకా పూర్తి కాలేదు. నయీం, అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సంబంధించిన అక్రమాస్తులను రాష్ట్రంలోని ఏ సర్వే నంబర్ లో గుర్తించినా ఆ సర్వే నంబర్ మొత్తాన్ని ధరణిలో నిషేధిత జాబితాలో చేర్చడం కొత్త సమస్యలకు దారితీసింది. ఆ సర్వే నంబర్ లో భూములు కలిగిన ఇతర రైతులకు పట్టాదారు పాస్ బుక్స్, సేల్ డీడ్ లు ఉన్నా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలా సుమారు 5 వేల ఎకరాల భూములు అకారణంగా నిషేధిత జాబితాలో కొనసాగుతున్నట్లు తెలిసింది.

నయీం అక్రమాస్తుల చిట్టా ఇదే

నయీం, అతడి కుటుంబ సభ్యుల పేరిట కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. అతడు సుమారు వెయ్యి ఎకరాల భూములను కబ్జా పెట్టడమో, లేదంటే అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేయించుకోవడమో చేశాడనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం సర్కార్ గుర్తించిన వివరాల ప్రకారం.. నయీం పేరిట 167 ఎకరాలు, అతడి భార్య హసీనా బేగం పేరిట 119 ఎకరాలు, బంధువులు తాహేరా బేగం పేరిట 99 ఎకరాలు, అబ్దుల్ సలీం పేరిట 89 ఎకరాలు, అహేలాబేగం–66 ఎకరాలు, హీనా కౌసర్–62 ఎకరాలు, షేక్​ ఫయాజ్​– 60 ఎకరాలు, సలీమా బేగం–47 ఎకరాలు, అయేషాబేగం – 18 ఎకరాలు, అతడి ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ పేరిట 71 ఎకరాలు ఉన్నాయి. ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆస్తులన్నింటిని సిట్ సీజ్ చేసింది. ఇందులో కొన్ని ఆస్తులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన 45 ఆస్తులను ఐటీ శాఖ సీజ్ చేసింది. ఇటీవల రూ.150 కోట్ల విలువైన మరో10 ఆస్తులను జప్తు చేసింది.

యాదాద్రి జిల్లా భువనగిరి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 58/ఈ1/1/2, 58/ఈ1/1/3లో మీర్ అలీ మేహ్దిఖాన్ కు చెందిన 2.12 ఎకరాల భూమిని సయ్యద్ రజా హుస్సేన్, ఖైరున్నీసా అనే ఇద్దరు 1.06 ఎకరాల చొప్పున 2019లో కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ తర్వాత రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ జరగడంతో కొత్త పాస్ బుక్స్ కూడా వచ్చాయి. అయితే ఇదే సర్వే నంబర్ లో గ్యాంగ్ స్టర్ నయీంకు చెందిన భూమి ఉండడంతో సిట్ అధికారులు మొత్తం సర్వే నంబర్ ను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టించారు. దీంతో రజా హుస్సేన్, ఖైరున్నీసాకు చెందిన భూమి కూడా అందులో చేరిపోయింది. వారి వద్ద క్లియర్ సేల్ డీడ్, పట్టాదార్ పాస్ బుక్ ఉన్నప్పటికీ వేరొకరికి అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి తీసేయాలని కలెక్టర్​కు ధరణి పోర్టల్ లో బాధితులు మూడుసార్లు (2100001193, 2100138163, 2100138156) అప్లికేషన్ పెట్టుకుంటే మూడు సార్లు రిజెక్ట్ చేశారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను అడిగితే వారు సిట్ నుంచి క్లియరెన్స్ అడుగుతున్నారు. ఈ విషయమై భువనగిరి తహసీల్దార్ సిట్ అధికారులకు నెల రోజుల కింద లెటర్​ రాసినా వారు క్లారిటీ ఇవ్వలేదు. నయీం, అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన వందలాది ఎకరాల భూములకు సంబంధించిన సర్వే నంబర్లను సిట్ అధికారులు ఇలా నిషేధిత జాబితాలో పెట్టించడంతో ఆ సర్వే నంబర్లలో భూములు కలిగిన రైతులకు తిప్పలు తప్పడం లేదు.